నైజాం సినీ మార్కెట్‌ను శాసిస్తోన్న కేటీఆర్ వైఫ్‌

సినిమా న‌టుల్లోనే కాదు.. సినిమాకు సంబంధించిన అన్ని వ్యాపారాల్లోనూ మొద‌టినుంచీ ఆంధ్ర ప్రాంతం వారిదే ఆధిప‌త్యం.. ఆంధ్ర‌, సీడెడ్‌, నైజాం ప్రాంతాల‌న్నింటా వీరిదే హ‌వా.. నైజాంకు సంబంధించి దిల్ రాజు వంటి వేళ్ల‌మీద లెక్కించ‌ద‌గ్గ కొంద‌రు కొన్నేళ్లుగా వెలుగులోకి వ‌చ్చి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌లుగాను, పంపిణీ రంగంలోనూ, ఎగ్జిబిట‌ర్లుగానూ రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారుతోంది.

ఇపుడు తాజాగా సినిమా పంపిణీ రంగంలో నైజాం మార్కెట్లో ఆ న‌లుగురికి చెక్ పెడుతున్న సంస్థ‌గా అభిషేక్ పిక్చ‌ర్స్ పేరు ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది. ఇటీవ‌లి కాలంలో విడుద‌లైన పెద్ద చిత్రాల‌న్నింటినీ ఈ సంస్థ‌ నైజాంలో రిలీజ్ చేస్తూ ప్ర‌త్య‌ర్థుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. శ్రీమంతుడు, నాన్న‌కు ప్రేమ‌తో, బ్ర‌హ్మోత్స‌వం లాంటి పెద్ద సినిమాల‌కు భారీ రేట్ల‌కు కొనుగోలు చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది అభిషేక్ పిక్చ‌ర్స్‌. ఓ వైపు వ‌రుస‌గా సినిమాలు నిర్మించేందుకు కూడా ప్లాన్లు వేస్తోంది.

కాగా ఈ సంస్థ వెన‌క కేసీఆర్ కోడ‌లు (కేటీఆర్ వైఫ్‌) పెట్టుబ‌డులు ఉన్నాయ‌న్న‌ది తాజా న్యూస్‌. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అల్లుడు ఇప్ప‌టికే ప్ర‌ముఖ రియ‌ల్ట‌ర్‌గా న‌గ‌రంలో వ్యాపారంలో స్థిర‌ప‌డ‌గా, ఇప్పుడు కేటీఆర్ కోడ‌లు  తెలంగాణ‌లో సినిమా బిజినెస్‌పై క‌న్నేశారు. అయితే ఈ వ్య‌వ‌హార‌మంతా వెన‌కుండి న‌డిపించేంది కేసీఆర్ త‌న‌యుడు కేటీఆరేన‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మ‌న్న‌మాట‌.

అభిషేక్ పిక్చ‌ర్స్ పేరుతో సాగుతున్న ఈ సినిమా వ్యాపారంలో తెలంగాణ రాజ‌కీయ‌నేత‌ల పెట్టుబ‌డులు ఉండ‌డంతో ఇదో ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌గా అతి త‌క్కువ కాలంలోనే ఎదిగిపోయింద‌న్న‌ ప్ర‌చారం సాగుతోంది. తాజాగా అభిషేక్ పిక్చ‌ర్స్ ఐఎఫ్ఎ (ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం బిజినెస్ -2016) అవార్డును ద‌క్కించుకోవ‌డంతో సంస్థ వార్త‌ల్లోకొచ్చింది.  ఈ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భంగా… సంస్థ కార్యాల‌యంలో అభిషేక్‌, బోయ‌పాటి శ్రీ‌ను చాలామంది ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు  పూజా కార్య‌క్ర‌మాల‌తో పాటు సంబ‌రాల్లో పాల్గొన‌డం గ‌మ‌నార్హం.