తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎవ‌రు..!

తెలంగాణ టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ న‌డుస్తున్నాయా?  పార్టీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మ‌ధ్య విభేదాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయా? ఈ విష‌యంలో రేవంతే దూకుడు మీదున్నాడా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప్ర‌స్తుతం టీటీడీపీలో ఈ విష‌యంపైనే చ‌ర్చ సాగుతోంది. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీ అటు ఏపీ, ఇటు తెలంగాణ‌లోనూ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది. తెలంగాణ పార్టీకి సీనియ‌ర్ నేత‌, బీసీ వ‌ర్గానికి చెందిన ఎల్‌.ర‌మ‌ణను అధ్య‌క్షుడిగా నియ‌మించారు. దీంతో పార్టీ అధిష్టానం ఆదేశాల‌ను అంద‌రూ తూ.చ‌. పాటిస్తున్నారు. అదే స‌మ‌యంలో యువ‌నేత‌, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియ‌మించారు.

ఇంత‌వ‌ర‌కు బానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కాలంలో అధికార టీఆర్ ఎస్‌పై సింగిల్ కాలిపై లేస్తున్న రేవంత్‌.. నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, దీక్ష‌ల‌తో ముందుకు పోతున్నారు. ఇది పార్టీకి ప్ల‌స్సే! అయితే, ఇది మ‌రోర‌కంగా మైన‌స్స‌ని అంటున్నారు పార్టీలోని ఓ వ‌ర్గం నేత‌లు. పార్టీ అధ్య‌క్షుడుగా ఉన్న ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో ఏ కార్య‌క్ర‌మ‌మైనా చేయాల‌ని అయితే, రేవంత్ మాత్రం సింగిల్‌గా సింగిల్ ఎజెండాతో ముందుకు పోతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇది పార్టీ నియ‌మాల‌కు విరుద్ధ‌మ‌ని అంటున్నారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌మ‌కు ఓ అధ్య‌క్షుడిని నియ‌మించార‌ని, ఏదైనా స‌రే ఆయ‌న‌తో చ‌ర్చించాకే కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని అయితే, రేవంత్ మాత్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. క‌నీసం అధ్య‌క్షుడు ఉన్నాడ‌నే విష‌యాన్ని కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌ల్ల‌న్న సాగ‌ర్ నిర్వాసితుల‌కు వ్య‌తిరేకంగా దీక్ష‌లు చేసిన స‌మ‌యంలోను, ఇటీవ‌ల హైద‌రాబాద్ రోడ్ల‌పై ఆందోళ‌న చేప‌ట్టిన స‌మ‌యంలోనూ రేవంత్ ఎవ‌రినీ సంప్ర‌దించ‌లేద‌ని, త‌న ఎజెండాతో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని, ఇది పార్టీకి విరుద్ధ‌మ‌ని అంటున్నారు. అయితే, ఇదే విష‌యాన్ని గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జాతీయ కార్య‌ద‌ర్శి లోకేష్‌కు వివ‌రించిన‌ట్టు స‌మాచారం. అయితే, ఓటుకు నోటు కేసులో రేవంత్ కీలకంగా ఉండడం, ఈ కేసుతో చంద్ర‌బాబు పైనా ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌డంతో రేవంత్‌కు ముకుతాడు వేయ‌లేక‌పోతున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

అయితే, టీటీడీపీ కేడ‌ర్ మాత్రం అటు ర‌మ‌ణ వ‌ర్గంగాను, ఇటు రేవంత్ వ‌ర్గంగానూ ఇప్ప‌టికే ఇన్న‌ర్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. తనకు తానుగా పార్టీ కార్యక్రమాలను రూపొందించినా..  ఆయా కార్య‌క్ర‌మాల్లో పెట్టే ప్లెక్సీల్లో పార్టీ అధ్య‌క్షుడిగా రమణ ఫొటోను  సైతం రేవంత్ పెట్ట‌డం లేద‌ని ర‌మ‌ణ వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇక‌, దీంతో టీటీడీపీ ర‌చ్చ రేపోమాపో రోడ్లెక్కే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని పొలిటిక‌ల్ పండితులు పేర్కొంటున్నారు. మ‌రి,,చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.