ఆ మాజీ మంత్రి చూపులు వైకాపా వైపు..!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. విప‌క్షాన్ని బ‌ల‌హీనప‌ర‌చేందుకు మొద‌లుపెట్టిన ఆప‌రేష‌న్ ఆకర్ష్  దెబ్బ‌కు వైసీపీ విల‌విల్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అంశంలో తాజాగా వైసీపీకి కాస్త ఊర‌ట క‌లిగించే ప‌రిణామాలు కూడా సంభ‌విస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. నిన్న‌టిదాకా అధికారంలో ఉన్న పార్టీలో చేరితే ఉండే ప్ర‌యోజ‌నాల‌ను అందిపుచ్చుకునేందుకు జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేలు  టీడీపీ గూటికి ప‌రుగులు తీశారు. ఒక‌రూ ఇద్ద‌రు కాదు దాదాపు 20మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్ద‌రు ఎంపీలు కూడా టీడీపీ కండువా క‌ప్పుకున్నారు.

         భ‌విష్య‌త్తులో మ‌రింత‌మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతార‌ని, జ‌గ‌న్ పార్టీ ఖాళీ కావ‌డం ఖాయ‌మ‌ని కూడా టీడీపీ నేత‌లు అన్నా ప్ర‌స్తుతం ఆజోరు క‌నిపించ‌డంలేదు. ప‌రిస్థ‌తి హ‌ఠాత్తుగా ఇలా భిన్నంగా మార‌డానికి ఇటీవ‌లి ప‌రిణామాలే కార‌ణంగా చెప్పాలి.  ప్ర‌జ‌ల్లో ఎంత సెంటిమెంటున్నా.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని తాజాగా కేంద్రం తేల్చిచెప్ప‌డం, ప్యాకేజీ పేరుతో భారీ అంకెలు చెప్పి.. ఇదే ఏపీ అభివృద్ధి రాచ‌మార్గ‌మ‌ని చెప్ప‌డం, దానికి చంద్ర‌బాబు జై కొట్టడం వంటి ప‌రిణామాల‌తో రాష్ట్ర ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెరుగుతోంది. త‌మ‌ను మోసం చేశార‌ని మోడీ, బాబుల‌పై  ఏపీ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

       ఇదే అద‌నుగా ప్ర‌త్యేక హోదా కోసం గ‌ళ‌మెత్తిన వైసీపీ  యోధుడు జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల్లో ప్ర‌స్తుతం మంచి మ‌ద్ద‌తే ల‌భిస్తోంది. దీంతో ఇక జ‌గ‌న్ తో లాభం లేదు.. పార్టీ దూకేయ‌డ‌మే మంచిద‌న్న ఆలోచ‌న‌తో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇపుడు ఆగిపోయిన‌ట్టు తెలుస్తోంది.  ప్ర‌స్తుతం ఏపీలో పొలిటిక‌ల్ ఈక్వేష‌న్స్ మారుతున్నాయ‌నే చెప్పాలి. గ‌తంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన సీనియ‌ర్ నేత‌లు స‌హ‌జంగానే టీడీపీలో తాము ఇమ‌డ‌లేమ‌న్న అభిప్రాయంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.. ఈ త‌ర‌హాలోనే విశాఖ జిల్లాలో  బ‌ల‌మైన నేత‌గా ఉన్న‌కొణ‌తాల రామ‌కృష్ణ టీడీపీలో చేరుతార‌న్న వార్త‌లు వినిపించినా ప్ర‌స్తుతం ఆయ‌న మ‌న‌సు మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది.

       రాష్ట్రంలో వైఎస్సార్సీకి జ‌నం మ‌ద్ద‌తు పెరుగుతుండ‌డంతో పాటు విజ‌య‌మ్మ స్వ‌యంగా ఫోన్ చేసి పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించ‌డంతో కొణ‌తాల మ‌ర‌లా వైసీపీ వైపే అడుగులు వేసే అవ‌కాశ‌ముంద‌ని  ఆయ‌న  అనుచ‌రులు చెపుతున్నారు. కొణ‌తాల గ‌తంలో వైఎస్ తో అత్యంత స‌న్నిహితంగా ఉన్న సంగ‌తి, ఆయ‌న‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సంగ‌తి తెలిసిందే…ఆ త‌ర్వాత జ‌గ‌న్ వెంట న‌డిచినా త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంలేద‌ని దూరం జ‌రిగారు..త్వ‌ర‌లో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నిక‌లు రాబోతున్న‌ నేప‌థ్యంలో కొణ‌తాల చేరిక‌తో ఉత్త‌రాంధ్ర‌లో వైఎస్సార్సీకి కొత్త ఊపు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.