టీఆర్ఎస్‌కు కొత్త శ‌త్రువు అదేనా!

తెలంగాణ బీజేపీ నేత‌ల్లో జోష్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోందా? అధికార టీఆర్ ఎస్ స‌హా సీఎం కేసీఆర్‌పై క‌మ‌ల దళం రెచ్చిపోతోందా? అమిత్ షా ప‌ర్య‌ట‌న వీరిలో కొత్త ర‌క్తం నింపిందా? ఇక‌, భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో క‌మ‌లం భారీ ఎత్తున గుబాళిస్తుందా? అంటే ఇప్ప‌టిక‌ప్పుడున్న ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. రెండు రోజుల కింద‌ట వ‌రంగ‌ల్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన బీజేపీ స‌భ‌లో క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. అటు కేసీఆర్ ఇటు టీఆర్ ఎస్‌ల‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. సొమ్ము మాది.. సోకు మీది అని స‌టైర్ల‌మీద స‌టైర్ల‌తో కుమ్మేశారు. మ‌జ్లిస్ పార్టీకి, ఆ పార్టీ నేత‌ల‌కి కేసీఆర్ ఒణికిపోతున్నార‌ని అన్నారు. విమోచ‌న దినాన్ని అందుకే ఆయ‌న ప‌క్క‌న పెట్టేశార‌ని అన్నారు.

తెలంగాణ గ‌డ్డ‌పై బీజేపీ నేత‌లు ఈ రేంజ్‌లో రెచ్చిపోయిన ఘ‌ట‌న‌లు గ‌తంలో ఎప్పుడూ లేవు. అంతేకాదు, తెలంగాణ బీజేపీని మ‌రింత బ‌ల‌ప‌రుస్తామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. దీంతో షా ప‌ర్య‌ట‌న‌, ఆయ‌న ప్ర‌క‌ట‌న మొత్తానికి బ‌హిరంగ స‌భకు వ‌చ్చిన రెస్పాన్స్‌.. టీ-బీజేపీలో కొత్త జోష్ నింపిన‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క‌, షా ప్ర‌సంగం, ఆయ‌న కామెంట్ల‌పై టీఆర్ ఎస్ నేత‌లు కూడా ఫైరైపోయారు. మా ద‌గ్గ‌ర నుంచి తీసుకుంటున్న‌దే తిరిగి మాకిస్తున్నార‌ని టీ నేత‌లు రెచ్చిపోయారు. అయితే, షా బ‌లంతో పుంజుకున్న రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ.. . సెప్టెంబర్ 17, పార్టీ ఫిరాయింపులపై గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, వీడియో క్లిప్పింగ్‌లను మీడియాకు చూపించారు.

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా మాట్లాడే నైజం కేసీఆర్‌దే అని దుయ్యబట్టారు. తెలంగాణాకు కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు 90 వేల కోట్లు మంజూరు చేసింద‌ని, దానిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ అంశంపై చర్చకు రావడానికి టీఆర్ఎస్ సిద్ధమా అని కూడా టీఆర్ ఎస్‌ను ఆయ‌న‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే.. తెలంగాణ బీజేపీలో ఖ‌చ్చితంగా ఏదో కొత్త జోష్ వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి దీనిని స్టేట్ క‌మ‌ల ద‌ళం ఏవిధంగా యూజ్ చేసుకుంటుందో చూడాలి. ఇక నిన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఇప్పుడు బీజేపీ దూకుడు చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్‌ను ప‌క్క‌న పెట్టేసి బీజేపీతో టీఆర్ఎస్ అధికారం కోసం ఫైట్ చేయాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని టీ పాలిటిక్స్ మేథావులు చెపుతున్నారు.