కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌!

తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేయాల‌ని కంకణం క‌ట్టుకుని త‌న‌దైన స్టైల్‌లో దూసుకుపోతున్న టీఆర్ ఎస్ అధినేత‌, కేసీఆర్‌కు అనూహ్య ప‌రిణామం ఎదురైంది. హైకోర్టు నుంచి ఊహించ‌ని షాక్ త‌గిలింది. బంగారు తెలంగాణ సాకారంలో భాగంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌ది జిల్లాల రాష్ట్రాన్ని 27 జిల్లాలుగా విభ‌జించాల‌ని అప్పుడు పాల‌న ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ అవుతుంద‌ని ప‌క్కా ప్లాన్‌తో దూసుకువెళ్తున్న కేసీఆర్ స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసింది. ముఖ్యంగా త‌న కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌రీంన‌గ‌ర్ జిల్లాకు సంబంధించే హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తాము చెప్పేవ‌ర‌కు ఈ జిల్లాను విభ‌జించి కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌డానికి వీల్లేద‌ని, అంతా త‌మ క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో కేసీఆర్ స‌హా ఆయ‌న కూట‌మి మంత్రులు తీవ్ర షాక్‌లో కూరుకుపోయారు. విష‌యంలోకి వెళ్లిపోతే..

క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాల విభ‌జన అంశం తెర‌మీద‌కి వ‌చ్చిన నాటి నుంచి ఇక్క‌డి ప్ర‌జ‌లు సిరిసిల్ల‌ను జిల్లా చేయాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయితే టెక్నిక‌ల్ ప్రాబ్లంస్ నేప‌థ్యంలో ఈ డిమాండ్‌ను ప్ర‌భుత్వం ప‌క్క‌న‌పెట్టింది. అయితే, అదే స‌మ‌యంలో ఇల్లంత‌కుంట మండ‌లాన్ని సిద్ధిపేట‌లో క‌లుపుతూ.. మ‌రో జిల్లాగా విభ‌జించాల‌ని నిర్ణ‌యించింది. దీంతో ఈ ప్ర‌తిపాద‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ..  సిరిసిల్లకు చెందిన న్యాయవాది ఏ.రమాకాంత్ రావుతో పాటు నలుగురు సర్పంచ్ లు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జిల్లాల విభ‌జ‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోపైనా వారు హైకోర్టులో ఫిర్యాదు చేశారు.

జీవో 362, ఫారం-1ప్రకటన ఆధారంగా కరీంనగర్ జిల్లాలో కొన్ని మండ‌లాల‌ను వేరే ప్రాంతంలో క‌లిపి జిల్లాలు ఏర్పాటు చేస్తున్నార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా విభజన పై గెజిట్ ను రెవెన్యూ, మండల, గ్రామ చావిడిలలో ప్రచురించలేదన్నారు. ఇల్లంత‌కుంట‌ను క‌రీంన‌గ‌ర్‌లోనే ఉంచి సిరిసిల్ల‌ను జిల్లాగా ప్ర‌క‌టించేలా ఆదేశించాల‌ని కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభత్వం నిబంధనల మేరకే నిర్ణయాలను తీసుకోవాలని తేల్చి చెప్పింది.

జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తమ తుది ఉత్తర్వులకు లోబడే ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌పై కేసీఆర్‌కు శ‌రాఘాతంగానే ప‌రిణ‌మించ‌నుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అంతేకాకుండా.. ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌లు డీకే అరుణ లాంటి వారు కూడా జిల్లాల ఏర్పాటు,  మండ‌లాల విలీనంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసి, దీక్ష‌ల‌కు కూడా దిగారు. తాజా కోర్టు ఆదేశాల నేప‌థ్యంలో వీరంతా కూడా న్యాయ‌పోరాటానికి దిగితే.. భ‌విష్య‌త్తులో కేసీఆర్ క‌ల తీర‌డం క‌ష్టంగా మారే ఛాన్స్ క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.