ఆ ఇద్ద‌రికి బెర్త్ క‌న్‌ఫార్మా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ ముహూర్తాన త‌న కేబినెట్‌ను త్వ‌ర‌లోనే విస్త‌రించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారో కానీ.. అప్ప‌టి నుంచి భారీ ఎత్తున ఆశావ‌హులు సీఎం కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అటు సోష‌ల్ మీడియా స‌హా బ్లాగుల్లో అదుగ‌దిగో.. బాబు కేబినెట్‌లో ఆయ‌న‌కు సీటు ఖాయం. కాదు కాదు.. సామాజిక వ‌ర్గం లెక్క‌ల ప్ర‌కారం ఈయ‌న‌కు ఖాయం.. అంటూ నిత్యం ఏదో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంది. అలాగే, ఇప్పుడున్న మంత్రుల్లో వారి వారి పెర్‌ఫార్మెన్స్ ఆధారంగా కొంద‌రిని తొల‌గిస్తార‌నే ప్ర‌చారమూ సాగుతోంది. ఇక‌, ఇప్పుడు తాజాగా కేబినెట్‌లో వీరికి సీటు ప‌క్కా అంటూ ఓ విశ్లేష‌ణ మీడియాలో భారీ ఎత్తున ప్రచార‌మ‌వుతోంది. దీనిని గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌కు బెర్త్ ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

ఏపీలో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు మిగిలిన నేత‌ల‌క‌న్నా ఎక్కువ‌గానే 2014లో లోకేష్ బాగా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే, ఆయ‌న ఎక్క‌డా ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల్లో పాల్గొన‌లేదు. ఆ త‌ర్వాత పార్టీలోనే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, యువ నాయ‌క‌త్వానికి పెద్ద పీట‌వేయాల‌ని గ‌త కొన్నాళ్లుగా భావిస్తున్న చంద్ర‌బాబు.. త‌న కుమారుడిని కూడా కేబినెట్‌లోకి తీసుకోవాల‌ని డిసైడ‌య్యార‌ని కొన్నాళ్లుగా తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు. దీంతో కొంద‌రు త‌మ ప‌ద‌వుల‌ను త్యాగం చేసుకుని.. లోకేష్‌కు హెల్ప్ చేస్తామ‌ని ముందుకు కూడా వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌న పేరు మ‌రోసారి క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రో ప‌ది ప‌దిహేను రోజుల్లో విస్త‌రించ‌నున్న కేబినెట్‌లో లోకేష్‌కు బెర్త్ ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇక‌, ప్ర‌స్తుత ఏపీ స్పీక‌ర్ కోడెల కూడా మంత్రి సీటు కోసం ప్ర‌య‌త్నిస్తున్న వారి జాబితాలో ఫ‌స్ట్ ఉన్నార‌ని స‌మాచారం. అస‌లు ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి నుంచి గెలిచిన రెండో రోజే త‌మ మ‌న‌సులో కోరిక‌ను ఆయ‌న చంద్ర‌బాబు చెవిలో ఊదార‌ట‌. అయితే, అప్ప‌ట్లో స్పీక‌ర్‌గానే చంద్ర‌బాబు ఆయ‌న‌ను తీసుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి కోడెల కూడా విస్త‌ర‌ణ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న‌ను కూడా సంతృప్తి ప‌ర‌చాల‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయిన‌ట్టు తాజా విశ్లేష‌ణ‌లు చెబుతున్నాయి.

అయితే, కోడెల‌కు గుంటూరు నుంచి ప్రాతినిధ్యం క‌ల్పిస్తే.. ఇదే జిల్లా నుంచి ఉన్న ఇద్ద‌రు మంత్రుల్లో ఒక‌రిపై వేటు త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా రావెల కిశోర్‌బాబు త‌ల‌పై ఉద్వాస‌న క‌త్తి వేలాడుతోంద‌ని అంటున్నారు. ఆయ‌న పుత్ర‌ర‌త్నం హైద‌రాబాద్‌లో చేసిన ప‌నిని సీఎం చంద్ర‌బాబు మ‌రిచిపోలేద‌ని స‌మాచారం. ఇక‌, రెండో మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ప‌నితీరుపైనా చంద్ర‌బాబు అసంతృప్తిగా ఉన్నార‌ని అంటున్నారు. మ‌రి వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రిని ఇంటికి పంపి.. కోడెల‌కు ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఏదేమైనా ఓ నెల రోజుల్లోగా కేబినెట్ విస్త‌ర‌ణ కొలిక్కి వ‌చ్చే ఛాన్స్ ఉంది.