కెసియార్‌ కన్నెర్రజేయబట్టే! 

హైదరాబాద్‌ని కనీ వినీ ఎరుగని రీతిలో జల విలయం కుంగదీస్తోంది. హైదరాబాద్‌ అంతటా భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజు కాదు, రోజుల తరబడి హైదరాబాద్‌ జల విలయంలో విలవిల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? అన్న ప్రశ్న బాధిత ప్రజానీకం నుంచి ఉత్పన్నమవడం సహజమే. భారీ వర్ష సూచనతో ముందస్తుగా అధికార యంత్రాంగం జాగ్రత్త పడి ఉంటే సమస్య తీవ్రత కొంచెం తగ్గేదే. కానీ ప్రభుత్వంలో ఉన్నవారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అతి ముఖ్యమైన అంశమ్మీద ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన కెసియార్‌, అక్కడినుంచే పూర్తిగా మానిటరింగ్‌ చేయడం కుదరలేదు.

అయితే ఇక్కడ ఉండి పరిస్థితిని చక్కదిద్దాల్సిన మంత్రులు, పార్టీ నాయకులు మాత్రం లైట్‌ తీసుకున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా, అది ముందుగా కెసియార్‌కే తెలిసింది. దాంతో ఆయన ఢిల్లీ నుంచే పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అప్పటికిగాని ఆయన కుమారుడు కెటియార్‌ కూడా రంగంలోకి దిగలేదు. ఈ రోజు అయితే పార్టీ ముఖ్య నాయకులలో చాలామంది వరద ముంపు ప్రాంతాల్లో కనిపించి, బాధితుల కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ పని తొలి రోజే చేసి ఉంటే బాధితులకు కొంత ఊరట దక్కేది. కెసియార్‌ కన్నెర్రజేయకపోయి ఉంటే పార్టీ నాయకులు ఇప్పటికీ ప్రజల వద్దకు వెళ్ళేవారు కాదేమో.