ఇచ్చారు, థ్యాంక్స్‌ చెప్పాను – తప్పేంటి!

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని, ఇచ్చిన విషయాల పట్ల సంతృప్తితో కేంద్రానికి థ్యాంక్స్‌ చెబితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఏది ఇచ్చినట్టో, ఏది ప్రకటించి ఊరుకున్నట్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎలా అనుకోగలం. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ లాంటి సహాయం ప్రకటించడం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన ప్రచారం తరహాలో మాత్రమే ఉంది. ఆ హామీలకు చట్ట బద్ధత కల్పించిన నాడే, అది ఆంధ్రప్రదేశ్‌కి దక్కేందుకు అవకాశాలు మెరుగుపడతాయి.

పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఈ రోజు పరిశీలించిన చంద్రబాబు, 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. అయితే దీనికిగాను కేంద్రం నుంచి పెద్దయెత్తున నిధులు ఆంధ్రప్రదేశ్‌కి రావలసి ఉందన్న విషయాన్ని చంద్రబాబు విస్మరించినట్లుగా కనిపిస్తోంది. ప్యాకేజీ పేరుతో సహాయాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, కనీసం పోలవరం ప్రాజెక్టుకి అయినా నిధుల్ని విడుదల చేసి ఉంటే, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై చెప్పిన మాటలు విశ్వసించగలిగేవిగా ఉండేవి. ముందే చంద్రబాబు ప్రతి విషయానికీ థ్యాంక్స్‌ చెబుతుండడంతో కేంద్రం కూడా ఇవ్వకపోయినా ఫర్వాలేదు, ఇస్తామని చెబితే సరిపోతుందనే భావనతో ఉన్నట్లుగా కనిపిస్తోందేమో!