బాబూ ‘దే బ్రీఫ్డ్‌ మీ’ పునర్విచారనట!

ఓటుకు నోటు కేసుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ కదిలించింది. ఆ పార్టీకి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై పునర్‌విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘దే బ్రీఫ్డ్‌ మీ’ అని ఈ కేసులో చంద్రబాబు వాయిస్‌తో వెలువడ్డ ఆడియో టేపులకు సంబంధించి పోరెన్సిక్‌ నుంచి వచ్చిన నివేదికను వైసిపి నేత తరఫు లాయర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో సెప్టెంబర్‌ 29 లోపు కేసు విచారణ పూర్తి చేయవలసిందిగా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

చంద్రబాబు ఈ కేసులో బుకాయించడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ సాక్షత్తూ దొరికిపోయింది టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిగారే. ఈ కేసు గొడవ తరువాతే రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్‌ పొందారు. ఇంతటి తీవ్రమైన కేసులో నిందితుడికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇవ్వడం ద్వారా కేసులో తన పాత్రని చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నట్లే అయ్యింది.

రేవంత్‌రెడ్డిని కాపాడుకోకపోతే పార్టీకి ఇబ్బందులొస్తాయి. అందుకే రేవంత్‌రెడ్డిని అప్రూవర్‌గా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన ప్రయత్నాల్ని తిప్పి కొట్టడంలో చంద్రబాబు సఫలమయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబు కేంద్రం నుంచి కూడా మద్దతు పొందారనే విమర్శలున్నాయి. వైసిపి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తరువాత ఈ కేసు కొత్త మలుపులు తిరిగిందని చెప్పడం నిస్సందేహం.