పొన్నం ఈ ఛాన్స్ మిస్ అవ్వడేమో!

రాజకీయాల్లో కొందరి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది.వాళ్లు ఫలానా పని చేయబోతున్నారని ముందుగా వాళ్లే లీకులిస్తారు.తీరా ఆ టైం వచ్చేసరికి వాళ్లే తూచ్ అదేం లేదు అదంతా ఉత్తినే అని మాట మార్చేస్తారు.ఈ కోవలో ముందుగా ఉండేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ ఒకరు ఇంకొకరు దానం నాగేందర్.

ఒకటి కాదు రెండు కాదు తెలంగాణా ఏర్పడ్డాక చాలా సార్లు వీరిద్దరూ కారెక్కి తెరాస తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వినిపించాయి.అయితే చివరి నిమిషం లో మళ్ళీ సీన్ రివర్స్ అవుతోంది.దానం సంగతెలా వున్నా పొన్నం ప్రభాకర్ మళ్ళీ తెరాస లో చేరనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.దీనికి ఆజ్యం పోస్తూ పొన్నం సోదరుడి కుమారుడు హుజూరాబాద్‌లో నెలకొల్పిన ఐటీ స్టార్టప్‌ కంపెనీ టెలెకా నెట్‌వర్క్‌ టెక్నాలాజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక సఖ మంత్రి కేటీర్ ప్రారంభించడంతో మళ్ళీ పొన్నం తెరాస వైపు చూస్తున్నాడని సంకేతాలిచ్చాడనే టాక్ నడుస్తోంది.

వివేక్,వినోద్,గుత్తా తదితరులు తెరాస లో చేరిన సందర్భం లోనే పొన్నం కూడా చేరనున్నాడనే వార్తలు వినిపించాయి.అయితే తనకు ఎదో ఒక అసెంబ్లీ స్థానం కేటాయించే హామీ కోసం పొన్నం పట్టుపట్టడం తో అప్పట్లో ఆ చేరిక వెనక్కి వెళ్ళింది.అయితే తాజాగా కేటీర్ చేతుల మీదుగా పొన్నం సోదరుడి కుమారుడి కంపనీ ప్రారంభం దానికి మంత్రి ఈటెల,ఎంపీ బాల్క సుమన్ హాజరు కావడంతో ఈ సారి పొన్నం చేరిక లాంఛనమే అనే వాదన వినిపిస్తోంది.

అయితే ఈ మొత్తం వ్యవహారం పొన్నం కుటుంబానికి సన్నిహితుడైన, ఈ మధ్యనే తెరాస తీర్థం పుచ్చుకున్న వివేక్ చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.గతంలో వివేక్ కాంగ్రస్ కి రాజీనామా చేసి తెరాస లో చేరినప్పుడే పొన్నం చేత కూడా రాజీనామా చేయించాలని తీవ్రంగా ప్రయత్నించినా అప్పుడు కుదరలేదు.అయితే తెరాస ప్రముఖులతో కలిసి పొన్నం భేటీ పై రక రకాల ఊహాగానాలు వినిపిస్తుండడం తో ఆబ్బె అదేం లేదు ఎదో నా సోదరుడి కుమారుడి కంపెనీ కాబట్టే వచ్చా..ఇందులో రాజకీయమేం లేదు అని యథావిథిగా ప్రతి రాజకీయ నాయకుడు ఇచ్చే కొసమెరుపు పొన్నం కూడా ఇచ్చేసాడు.