జనసేన ఇకపై హైపర్‌ యాక్టివ్‌!

తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఏం సంకేతాలు పంపుతున్నట్టు? ఇకపై జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ఆయన నిర్ణయించుకున్నారా? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే, పవన్‌కళ్యాణ్‌ గత రాజకీయ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సభ తర్వాత మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళకుండా ఉంటారా? అనే అనుమానాలు కలగడం సహజం.

ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌, కాకినాడ వేదికగా ఇంకో బహిరంగ సభ నిర్వహిస్తానని అన్నారు. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తనతో చెప్పారనీ, జనసేన పార్టీని బిజెపిలో కలిపేయాల్సిందిగా ఆయన కోరినప్పటికీ, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం జనసేన పనిచేస్తుందని తాను అమిత్‌షాకి చెప్పాననీ, రాజకీయ అవసరాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు పవన్‌కళ్యాణ్‌.

అయితే రెండేళ్ళుగా కనీసం పార్టీని విస్తరించలేకపోయిన పవన్‌కళ్యాణ్‌ ఇక ముందు జనసేన పార్టీని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మలచుతారని విశ్వసించలేం. కానీ వచ్చిన అవకాశమైతే అద్భుతం. దాన్ని వినియోగించుకోవడంలోనే ఆయనకు సమస్యలున్నాయి. హైపర్‌ యాక్టివ్‌ ప్రదర్శిస్తూ అంతలోనే పార్టీని డైల్యూట్‌ మోడ్‌లోకి తీసుకెళ్ళడం పవన్‌కళ్యాణ్‌కి మాత్రమే చెల్లింది.