చంద్రబాబు పై అసంతృప్తితో పయ్యావుల

టీడీపీ సీనియ‌ర్ నేత ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశవ్‌.. పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై ప‌రోక్షంగా ఫైర‌య్యారా? చ‌ంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ద‌శాబ్దాలుగా టీడీపీకి సేవ చేస్తున్నా, ప‌దేళ్లపాటు ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు నానా తిప్పలు ప‌డి అధికారంలోకి తీసుకువ‌చ్చినా త‌మ‌కు ఎలాంటి గుర్తింపూ లేద‌ని ఆయ‌న వాపోతున్నట్టు తెలిసింది. అంతేకాదు, ముందొచ్చిన చెవుల క‌న్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా పార్టీ అధినేత త‌మ‌ను కాద‌ని, ఇప్పుడిప్పుడే సైకిలెక్కుతున్న వారిని ప్రోత్సహిస్తుండ‌డం, వారికి ప‌ద‌వులు క‌ట్టబెడుతుండ‌డంపైనా పయ్యావుల తీవ్ర అస‌హనం వ్యక్తం చేస్తున్నారు.

త‌న త‌ల‌రాత ఇలా ఉందంటూ ఆయ‌న తీవ్ర నిర్వేదానికి గుర‌వుతున్నార‌ట‌. సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల తిరుపతి  కార్పోరేషన్ బాధ్యతలను కేశవ్‌కు అప్పగించారు. దీంతో కేశ‌వ్ త‌ర‌చుగా తిరుప‌తికి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఒకింత అస‌హ‌నానికి గుర‌య్యారు. ఇలాంటి చిన్నా చిత‌కా ప‌నులు మేం చేయాల‌ని బుగ్గకారులో తిరిగేందుకు మాత్రం ఇప్పుడొచ్చిన వారికి అవ‌కాశం ఇస్తారు అంటూ ఆయ‌న త‌న ఆవేద‌న‌ను వెళ్లగ‌క్కార‌ట‌. పార్టీ పదేళ్లు కష్టకాలంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డామని, తీరా అధికారంలోకి వస్తే అనుభవించేందుకు ఇతరులు తయారయ్యారని , ఏం చేద్దాం..మన తలరాతే అట్లా ఉందంటూ వ్యాఖ్యానించినట్లు స‌మాచారం. మ‌రోప‌క్క‌, త్వర‌లోనే కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ఇటీవ‌ల చంద్రబాబు ప్రక‌టించ‌డంతో ప‌య్యావుల ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, ఇప్పట్లో ఉండ‌బోద‌ని తెలియ‌డం, ఆ సీటుకు కూడా రిజ‌ర్వేష‌న్ అయిపోవ‌డం వంటి విష‌యాలు తెలియ‌డంతో ఆయ‌న మ‌రింత నిరుత్సాహానికి గురై ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే, కేశవ్ తో పాటు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర కూడా మంత్రి ప‌ద‌వుల‌ను ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. మ‌రి చంద్రబాబు ఎవ‌రిని క‌రుణిస్తారో? ఎవ‌రికి హ్యాండిస్తారో చూడాలి.ప‌య్యావుల పార్టీ విప‌క్షంలో ఉన్న రెండుసార్లు 2004, 2009లో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి 2014లో మాత్రం ఓడిపోయారు. దీంతో మంత్రి కావాల‌నుకున్న ఆయ‌న కోరిక నెర‌వేర‌లేదు. త‌ర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటికే కేశవ్ సామాజిక‌వ‌ర్గమైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నుంచి ఎక్కువ మంది సీనియ‌ర్లు కూడా కేబినెట్ బెర్త్ రేసులో ఉండ‌డంతో  ఆశ‌లు తీర‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది.