గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ వెనుక అసలు దొంగలెవరు!

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఒక్కడే వేల కోట్ల ఆస్తుల్ని కూడగట్టలేడు. పెద్దల అండదండలు ఆయనకు పుష్కలంగా ఉండే ఉండాలి. వందలాది డాక్యుమెంట్లు ఆయన ఇంట్లో లభ్యమయ్యాయి. ఇంకా ఆయన అనుచరుల ఇళ్ళలో డాక్యుమెంట్లు దొరుకుతున్నాయి. నయీమ్‌ అనుచరులెందరో లెక్క తేల్చడమే పోలీసులకు కష్టంగా మారింది. తవ్వుతున్న కొద్దీ నయీమ్‌ బాగోతాలు కొత్త కొత్తగా వెలుగు చూస్తూనే ఉన్నాయి.

నయీమ్‌ ఓ వ్యక్తి కాదు ఓ శక్తి అనేంతలా ఆయన చుట్టూ ఓ పెద్ద కోట ఉంది. ఆ కోటని ఛేదించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల అండదండలతో నయీమ్‌ చెలరేగిపోయాడని ప్రచారం జరుగుతున్నది. ఆయన ఇంట్లో పలువురు పోలీసు అధికారుల తాలూకు వివరాలు, వారికి నయీమ్‌ చేసి పెట్టి పనుల వివరాలు దొరకడంతో పోలీసు వర్గాలే షాక్‌కి గురయ్యాయి.

ఉన్నపళంగా నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ జరిగిందంటే పెద్దతలకాయలతో అతనికి వ్యవహారం చెడటం వల్లేనని సిపిఐ నేత నారాయణ ఆరోపించడం కూడా ఆలోచించదగ్గదే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా నయీమ్‌ దందాలు నిర్వహించాడు. ఓ ముఖ్యమంత్రిని మించి ఆయన ఆస్తులు కూడగట్టిన వైనం దేశమంతా షాక్‌ తినేలా చేసింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడినా, ఈ స్థాయిలో ఆస్తుల్ని కూడగట్టడం అసాధ్యమే. అందుకే అతను నయీమ్‌ అయ్యాడు.