కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేసిన సింధూ

పీవీ సింధు విజ‌యం ఇపుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త స‌మ‌స్యగా మారింది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా సింధూను ప్ర‌క‌టించాల‌ని ఇప్పటికే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక‌ట్రెండు సామాజిక‌వ‌ర్గాలు, పార్టీలు సైతం ఇదే గ‌ళం వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ సైతం సేమ్ టు సేమ్ గ‌ళం వినిపించారు.

ఒలింపిక్స్‌లో సింధూ రజతం గెలవడం దేశానికి గర్వకారణమ‌ని చాముండేశ్వర‌ నాథ్‌ అన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌లో సింధు బాగా పోరాడిందని అభినందించారు. భవిష్యత్‌లో తప్పక స్వర్ణపతకాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఒక్కరే ఉండాల‌ని ఏం లేదు కనుక.. ఇద్దరినైనా ప్రకటించవచ్చని చాముండేశ్వ‌ర నాథ్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రస్తుత తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న సానియా మీర్జాకు సైతం చాముండేశ్వర నాథ్ సన్నిహితంగానే ఉంటారు.

సింధూను సైతం రాష్ట్ర ప్రచార‌క‌ర్తగా నియ‌మించాల‌నే డిమాండ్‌లు వ‌స్తాయ‌ని ప‌లువురు అంటున్నారు.పీవీ సింధుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే వరాల జల్లు కురిపించారు. పీవీ సింధుకు ఐదు కోట్ల నగదు ప్రోత్సాహంతోపాటు హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం వేయి గజాల స్థలం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సింధుతోపాటు ఆమె కోచ్ గోపీచంద్ అకాడమీకి కోటి రూపాయల నగదును ఇవ్వాలని నిర్ణయించారు.