కేసీఆర్‌కి పవర్‌ పాయింట్‌ దెబ్బ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి తెలంగాణలోని నీటి ప్రాజెక్టులపై కాంగ్రెసు పార్టీ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలను ఆహ్వానించి తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఈ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు.

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ గడచిన రెండేళ్ళలో తెలంగాణలోని కెసియార్‌ ప్రభుత్వం సాధించినదేమీ లేదని కాంగ్రెసు చేస్తున్న ఆరోపణలు, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌తో ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళేలా ఉన్నాయట. కొత్త రాష్ట్రంలో అన్నీ అనుకోగానే అయిపోవుగానీ, ప్రభుత్వం చెబుతున్న మాటలకీ, జరుగుతున్న పనులకీ పొంతన లేకపోవడంతోనే ఈ సమస్య వస్తుంది.

దానికి తోడు అంచనాల్ని పెంచేయడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగమవుతుందనే అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి ఈ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తీసుకెళుతుండడంతో అధికార పార్టీ వర్గాల్లో ఆందోళన పెరుగుతోందట. ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే రెండేళ్ళు మూడేళ్ళు సరిపోవు నేటి కాలంలో. అది తెలిసీ వాస్తవాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రచారార్భాటాలు చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. ఉన్నపళంగా ఈ సమస్య నుంచి గట్టెక్కడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ దృష్టిపెట్టారట. కానీ అదెలా? సాధ్యమేనా!