అరెస్టు చేస్తారా? మేం రెడీ!

‘అసత్య ఆరోపణలు చేస్తే జైలుకు పంపిస్తాం, జైలుకూడు తినడానికి సిద్ధంగా ఉండాలె’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ చేసిన హెచ్చరికలకు తెలంగాణలోని విపక్షాలు సానుకూలంగా స్పందించాయి. జైలు కూడు తినిపిస్తారా? తినిపించి చూడండి అని సవాల్‌ విసిరారు టిడిపికి చెందిన రేవంత్‌రెడ్డి, కాంగ్రెసు పార్టీకి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రజా జీవితంలోకి వచ్చాక విమర్శలను తట్టుకునే ఓపిక ఉండాలి తప్ప, అసహనం ఉండకూడదని వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ తీరుని తప్పుపట్టాయి. ‘మేం అరెస్టయితే, మీ బండారం బయటపెడ్తాం’ అని విపక్షాలు చేసిన హెచ్చరికలతో తెలంగాణలోని అధికార పక్షం ఒకింత ఆందోళన చెందుతోంది.

అయితే విపక్షాలపై మానసికంగా పైచేయి సాధించడానికి కెసియార్‌ పొలిటికల్‌ గేమ్‌లో భాగంగానే ‘జైలు కూడా’ అనే పద ప్రయోగం జరిగింది తప్ప, ఇందులో దీర్ఘాలు తీయడానికి ఏమీ లేదని టిఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ‘జైలుకూడు’ అనే మాటతో కెసియార్‌, విపక్షాలకు ఆయుధాన్ని ఇచ్చేశారు. విపక్షాలు ఆరోపణలు చేయకుండా ఉండవు. అలాగని, ఇప్పుడు కెసియార్‌ వారిని అరెస్టు చేయించకపోతే, తానే తప్పు చేసినట్లవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, కేసులు పెట్టగలవేమోగానీ, జైలుకూడు తినిపించలేవు. అరెస్టు చేయడం వరకు పోలీసులపై ఒత్తిడి తేవచ్చునేమోగానీ, శిక్ష పడటం అనేది కోర్టుల పరిధిలోని అంశం. అది విపక్షాలకు బాగా తెలుసు. అదే వారి ధీమా.