‘స్విస్‌’ ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కున్నారా?

రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు. ఆయన రాజకీయాల్లో ఉండగానే ఒకప్పటి తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా విడిపోయింది. అలా విభజన జరగడానికి ఆయన కూడా ఓ కారణం. 23 జిల్లాల తెలుగు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా రికార్డు సమయం ఏకధాటిగా పరిపాలించిన ఘనత చంద్రబాబుకి మాత్రమే దక్కింది.

ఆయన ఇప్పుడు కేవలం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి. పదేళ్ళు సమైక్య తెలుగు రాష్ట్రానికి ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఆయన ముందు ఓ కొత్త రాష్ట్రానికి రాజధానిని నిర్మించే సవాల్‌ నిలిచి ఉంది. ఆ సవాల్‌ని ఆయన స్వీకరించినప్పటికీ, దాని చుట్టూ అనేక అనుమానాలున్నాయి. మన దేశంలో స్విస్‌ ఛాలెంజ్‌ పద్దతిపై ఎన్నో విమర్శలుండగా, ఆ విధానం ప్రకారమే రాజధానిని నిర్మించడానికి చంద్రబాబు సంసిద్ధులయ్యారు.

భారతదేశంలో టాలెంట్‌కి కొదవ లేదు. కానీ చంద్రబాబు విదేశాల్ని, విదేశాల్లోని కంపెనీలను పట్టుకుని వేలాడుతున్నారు. మన దేశంలోనే ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నెన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతున్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌ విధానం నుంచి ‘మేడిన్‌ ఇండియా’ నినాదంతో ముందడుగు వేస్తే మంచిదేమో. లేదంటే రాజకీయంగా చంద్రబాబు ‘స్విస్‌’ ఉచ్చులో ఇరుక్కుని ముందు ముందు ఎన్నో వివాదాలను ఎదుర్కోవలసి రావొచ్చునంటున్నారు రాజకీయ పరిశీలకులు.