యువనేతకి సుప్రీం షాక్‌

పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌ అనే విమర్శలను ఎదుర్కొంటున్న కాంగ్రెసు యువ నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టైమ్‌ పాస్‌ కోసం చేసే విమర్శలు ఆయన్ని వివాదంలోకి లాగేస్తుంటాయి. తద్వారా ఆయన ఆ వివాదాల నుంచి బయటపడేందుకు నానా ఇబ్బందులూ పడాల్సి వస్తుంది.

మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందని ఓ సందర్భంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్‌ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన సుప్రీంకోర్టు, క్షమాపణ చెప్తారా? కేసు విచారణను ఎదుర్కొంటారా? అని రాహుల్‌గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. దాంతో ఆర్‌ఎస్‌ఎస్‌కి రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఆర్‌ఎస్‌ఎస్‌ పరువు నష్టం దావా వేయడంలో రాహుల్‌గాంధీ ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయారు. క్షమాపణ చెప్పి విచారణ నుంచి తప్పించుకోవడం ఒక్కతే రాహుల్‌గాంధీ ముందున్న మార్గం. అయితే కాంగ్రెసు వర్గాలు ఈ వివాదంపై స్పందించడానికి నిరాకరిస్తున్నాయి. నాయకుడన్నాక ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుందని కాంగ్రెసు పెద్దలు రాహుల్‌గాంధీ గురించి చెవులు కొరుక్కుంటున్నారట. కాంగ్రెసు పార్టీకి రాహుల్‌ గాంధీ వల్ల వచ్చిన లాభం ఏమీ లేదని, రాహుల్‌ గాంధీతో సమస్యలు ఎక్కువవుతున్నాయని పార్టీ వర్గాలు వాపోతున్నాయని సమాచారమ్‌.