వేడుకలు సీమకి అభివృద్ధి అమరావతికి!

అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాగా తయారైంది రాయలసీమ అభివృద్ధి వ్యవహారం.ఒకప్పటి రాయలు పాలించిన రతనాల సీమ నేడు పాలకుల నిర్లక్ష్యానికి గురై అంతకంతకు వెనుకబడిపోతోంది.రాయలసీమ అంటే కేవలం ముఖ్య మంత్రుల్ని సప్లై చేసే ఫ్యాక్టరీ గానే చూస్తున్న తరుణం లో దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర రెడ్డి గారు అది నిజం కాదని నిరూపిస్తూ రాయసీమను కరువు కోరల్లోంచి రక్షించేందుకు అనేక తాగు,సాగు నీటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాడు.ఒక్క ప్రాజెక్టులే కాదు విద్య,వైద్య,పారిశ్రామిక రంగాల్లో రాయలసీమకి రాజశేఖర రెడ్డి చేసిన మేలు చరిత్రలో ముందెన్నడూ జరగలేదన్నది వాస్తవం.

రాయలసీమ అపారమైన ఖనిజ సంపదకు పెట్టింది పేరు.అయినా ప్రస్తుతం రాయలసీమ నిర్లక్యానికి గురవుతోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయానా రాయలసీమ జిల్లా అయిన చిత్తూరు జిల్లా వాసి.అయినా సరే అమరావతి ప్రదక్షిణలే తప్ప రాయలసీమ బాగోగుల్ని బాబు పట్టించుకున్న పాపాన పోలేదు.ఏది చేసినా రాయలసీమ పేరుతో రాజకీయమే తప్ప చిత్తశుద్ధి లేదు. పేరుకే పట్టిసీమ.అసలు పట్టిసీమ పుట్టుకే రాయలసీమ అవసరాల కోసం అని ఊదరగొట్టారు.వాస్తవానికి పట్టిసీమ అసలు లక్ష్యాలు కృష్ణ డెల్టా సాగు,రాజధాని అవసరాలకే అన్నది నిర్వివాదాంశం.

అయినా బాబు రాయలసీమకి మొసలి కన్నీరు కార్చడం బాధాకరం.రాయలసీమని అభివృద్ధికి ఆమడ దూరం లో ఉంచిన బాబుగారు స్వాతంత్య్ర సంబరాలు మాత్రం అనంతలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం ఎవరి మెప్పుకోసమో అర్థం కాదు.
ఇప్పటికే అమరావతి ప్రజారాజధాని కాదు,మరీ ముక్యంగా రాయలసీమకి ఏ మాత్రం రాజధాని కాదు అన్న చందాగా బాబుగారు వ్యవహరిస్తున్నారు.రాజధాని ఆ నాలుగు జిల్లాలకే పరిమితం అన్నట్లు పాలన సాగిస్తున్నారు బాబుగారు.

విభజన జరిగిన తర్వాత రాజధాని ఎక్కడో నిర్ధారణ కాని పరిస్థితుల్లో బాబు ప్రభుత్వం 2014లో కర్నూలులో కోటిన్నర రూపాయల ఖర్చుతో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరిపింది. రాజధానిని కర్నూలులోనే ఏర్పాటుచేయాలన్న డిమాండ్ సీమవాసుల నుంచి వినిపించింది. శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా పలువురు నేతలు గుర్తుచేశారు. ఆ డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని స్వాతంత్య్ర సంబరాలు కర్నూలులోనే నిర్వహించారు. ఆ సందర్భంగా రాయలసీమను మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా ఏర్పాటుచేస్తామని బాబు ప్రకటించారు. అదే సభలో దాదాపు 40వేల కోట్ల రూపాయల వ్యయంతో పలు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.అంతే అది కేవలం ప్రకటనతోనే ఆగిపోయింది.

మళ్ళీ రాయలసీమలో అలజడులు మళ్లీ మొదలయ్యాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న డిమాండును మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు.ఆ తర్వాత కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజుల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి.బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోస్తాప్రాంతంమీదే దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి.శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటుచేయగా, గుంటూరులో హైకోర్టును ఏర్పాటుచేశారని, ఇప్పుడు కూడా అదేవిధంగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.రాయలసీమకు ఇచ్చిన ప్రాజెక్టులు కూడా కోస్తాకు తరలించుకు వెళుతున్నారన్న ఆందోళన సీమవాసుల్లో మొదలయింది.

ఇంకేముంది సీమ ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తున్నారని బాబుగారికి అర్థం అయింది.స్వాతంత్య్ర దినోత్సవాన్ని అనంతలో నిర్వహించడం ద్వారా, ఆ ప్రాంత ప్రజలపై తన ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకునే ఎత్తుగడకు తెరలేపారు.అయినా వేడుకలు నిర్వహించి సీమ అభివృద్ధి జపం చేసేసి వెళ్ళిపోతే ప్రజలు క్షమించరు.వెనుకబడిన రాయలసీమ అభివృద్ధిపై రాజకీయాలు చేస్తే మరో వేర్పాటు వాడ ఉద్యమానికి బాబే ఆజ్యం పోసినవాడవుతాడు.