వాళ్ళ టార్గెట్ లిస్ట్ లో స్టీల్ సిటీ కూడా!

ఇన్నాళ్లూ తెలంగాణకే పరిమితమైన ఉగ్రవాదుల కదలికలు ఇప్పుడు ఆంధ్రా ప్రాంతానికి కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా పోలీసులు సేకరిరచిన సమాచారం అనేక ప్రాంతాల్లో బహిర్గతమవుతున్న కదలికలు చూస్తే ముష్కర మూకలు ఏపీలోనూ పాదం మోపుతున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో పోలీసుల నిఘా ఎక్కువవుతుండడంతో వారు ఆంధ్రాలో తలదాచుకుని, తమ కార్యక్రమాలను కొనసాగించేదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా, ఆల్‌ ఖైదా, ఐసిస్‌, పిఎఫ్‌ఐ వంటి సంస్థలు రాష్ట్రంలో పాగా వేసేరదుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు సందేహిస్తున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు ఉన్నట్లుగా ఆరు నెలల క్రితమే పోలీసులకు సమాచారం అందింది. గతంలో ఐఎస్‌ఐ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన నేపథ్యంలో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని సువిశాల తీర ప్రాంతాన్ని ఉగ్రవాదుల తమ కదలికలకు అనుకూలంగా మలచుకోవడంతో పాటు, ఆర్థిక రాజధానిగా భావిస్తున్న గ్రేటర్‌ విశాఖపట్నం నగరంపై వారు దృష్టి సారిచినట్లు తెలుస్తోంది. తూర్పు నావికాదళానికి ప్రధాన కేంద్రమైన విశాఖ నావల్‌ కమాండ్‌ గురించి ఐఎస్‌ఐ ఏజెంట్లు ఆరా తీసినట్లు వెల్లడైంది. అలాగే ముంబయిని కుదిపేసిన 26/11 దాడుల తరహాలోనే విశాఖపై కూడా విరుచుకుపడే ప్రమాదం ఉందని అరెస్టయిన ఉగ్రవాదుల ద్వారా కేంద్ర అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పోలీసులకు కూడా హెచ్చరికల ద్వారా పంపించినట్లు తెలిసింది. రాష్ట్ట్రంలో తూర్పు నావికా దళానికి ప్రధాన స్థావరంగా ఉన్న విశాఖతో పాటు ఇతర ఓడరేవులున్నందున ఏపిలో పఠాన్‌కోట్‌ ఎయిర్‌ బేస్‌ తరహాలో దాడికి పాల్పడే వీలుందని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.

హైదరాబాద్‌, విశాఖ, కృష్ణా, ఉభయ గోదావరి, కడప వంటి జిల్లాల్లోని విద్యార్థులు, ఐటి రంగ నిపుణులపై ఉగ్రవాద సంస్థలు దృష్టి సారిస్తున్నట్లు పోలీసు వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు కీలక పట్టణాల్లో ఐసిస్‌ స్లీపర్‌సెల్స్‌ను నియమించుకునేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం ఉందంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రభావం ఉందని చెబుతున్నారు. ఉగ్రవాద సానుభూతిపరులంటూ హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ అధికారులు కొందరిని అదుపులోకి తీసుకొని ఇప్పటికే రహస్యంగా విచారిస్తున్నారు. వారి నుంచి లభించే ఆధారాలు, వివరాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపైనా ఒక విశ్లేషణకు రావాలని ఎపి పోలీసు అధికారులు భావిస్తున్నారు.