నవదీప్‌కి మెగా టర్నింగ్‌ పాయింట్‌! 

యంగ్‌ హీరో నవదీప్‌, హీరోగా అవకాశాలు దక్కించుకోలేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకూ ఓకే చెప్పేస్తున్నాడు. ‘ఆర్య-2’ సినిమాలో నవదీప్‌ పాత్రకి ఎంతో పేరొచ్చింది. ‘చందమామ’ సినిమాతో హీరోగా అలరించాడు. ఇంకా మరికొన్ని సినిమాల్లో తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నాడీ యంగ్‌ హీరో. ‘బాద్‌షా’ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో కనిపించి మెప్పించాడు నవదీప్‌. అయితే ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే రామ్‌చరణ్‌తో చేస్తున్న ‘ధృవ’ చిత్రం ఇంకో ఎత్తు అని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం.

తమిళ సినిమా ‘తని ఒరువన్‌’ని రామ్‌చరణ్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌తోపాటు నవదీప్‌ కూడా పోలీస్‌ గెటప్‌లో కనిపిస్తాడు. ఆ పాత్రకు సినిమాలో ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువట. నవదీప్‌ కెరీర్‌కి బిగ్‌ టర్నింగ్‌ పాయింట్‌ అయ్యేలా ‘ధృవ’ సినిమాలో నవదీప్‌ పాత్ర ఉంటుందని సమాచారమ్‌. రామ్‌చరణ్‌ ఎంకరేజ్‌మెంట్‌తో ముందు అనుకున్నదానికన్నా నవదీప్‌కి ఎక్కువ ప్రాధాన్యత సినిమాలో దక్కిందట. ఆ పాత్ర ఏంటో, దాని ప్రాధాన్యత ఏంటో తెరపై చూస్తేనే బావుంటుందని చెబుతూ విశేషాల్ని బయటపెట్టేందుకు చిత్ర యూనిట్‌ సుముఖత వ్యక్తం చేయట్లేదు.

తమిళ ‘తని ఒరువన్‌’తో పోల్చితే తెలుగు ‘ధృవ’కి చాలా మార్పులు చేశారట. ఆ మార్పుల్లో నవదీప్‌ పాత్ర కూడా ఒకటని తెలియవస్తోంది. నవదీప్‌కి తెలుగు సినీ పరిశ్రమలో అందరితోనూ మంచి స్నేహం ఉంది. మెగా కాంపౌండ్‌లో ఇప్పటికే అల్లు అర్జున్‌తో చేసిన నవదీప్‌, మొన్నటి సినీ ‘మా’ అవార్డ్స్‌లో చిరంజీవికి వీరాభిమానని అన్పించుకున్నాడు. ఈ యంగ్‌ హీరో, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో సెన్సేషన్‌ హిట్‌ అందుకోవాలని ఆశిద్దాం.