మెగాస్టార్‌ వైజ్‌ డెసిషన్‌

తిరిగి సినిమా రంగంలోకి వచ్చాక చిరంజీవి ఆలోచనల్లో చాలా మార్పు కనిపిస్తోంది. కాంగ్రెసు నాయకుడిగా ఉన్నప్పుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తటపటాయించారు చిరంజీవి. కానీ కాంగ్రెసు వాసనలు పక్కన పెట్టిన చిరంజీవి, అందర్నీ కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా తన పట్ల వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడుతున్న చిరంజీవిని చూస్తే ఆయన అభిమానులకే ముచ్చటేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమమే అయినప్పటికీ ఇందులో విపక్షాలేవీ పాల్గొనవు మామూలుగా అయితే. హరితహారం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని, అవినీతి పెరుగుతోందని విపక్షాలు విమర్శించడం మామూలే. చిరంజీవి కాంగ్రెసు నాయకుడు కాబట్టి, విమర్శించకపోయినా హరితహారం కార్యక్రమానికి దూరంగా ఉంటారని కాంగ్రెసు నాయకులు అంచనా వేశారట. కానీ మంచి కార్యక్రమం కావడంతో సమాజానికి తన కారణంగా కొంతైనా మేలు జరుగుతుందని భావించి చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియవస్తోంది.

చిరంజీవి హరిత హారంలో పాల్గొనడం పట్ల టిఆర్‌ఎస్‌ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెసు నాయకులు చిరంజీవిని చూసి బుద్ధితెచ్చుకోవాలని చెప్పడం కాంగ్రెసు పార్టీకి ఇబ్బందికర అంశం. అయినప్పటికీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న చిరంజీవి ముందుగా ‘అందరివాడు’ అనిపించుకోవాలి. ఇప్పుడు ఆయన చేస్తున్నది అదే.