ముద్రగడ మౌనం అందుకేనా?

ముద్రగడ రెంటికీ చెడ్డ రేవడి
నిరాహార దీక్ష ఎపిసోడ్‌ తర్వాత ముద్రగడ పద్మనాభంను ఎవరూ పట్టించుకోవడంలేదట. ఆయన్ను కొందరు నేతలు కలుస్తున్నప్పటికీ ఆ విషయాలకు మీడియాలో తగిన ప్రాధాన్యత దక్కడంలేదు. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసాలపై కేసులు నమోదవడంతో కాపు ఉద్యమ నాయకులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. టిడిపితో సర్దుకుపోతే కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లు, ఇతర సహాయాల్ని పొందగలుగుతుందని లేని పక్షంలో వివాదాలు ముదిరి కాపు ఉద్యమం పక్కదారి పడుతుందనే ఆలోచన ఆ సామాజిక వర్గ ప్రముఖులలోనూ కనిపిస్తోంది. అందుకే ముద్రగడను అందరూ దూరం పెడుతున్నారని సమాచారమ్‌.

జగన్‌ మీడియాకి తప్ప ముద్రగడ పద్మనాభం ఇంకెవరికీ అందుబాటులోకి రావడంలేదు. అంతే కాదు మిగతా మీడియా కూడా ముద్రగడని రాజకీయ నాయకుడిలాగానీ ఉద్యమ నాయకుడిగా కానీ చూడని పరిస్థితులు గోచరిస్తున్నాయి. టిడిపితో సర్దుకుపోతే తప్ప తన భవిష్యత్‌ బాగుండదనే నిర్ణయానికి ముద్రగడ ఇప్పుడు వచ్చినా దాని వల్ల ఆయనకు లాభం ఉండకపోవచ్చు. ఎందుకంటే కాపులకు రిజర్వేషన్లను టిడిపి కల్పించాలనుకుంటే, ముద్రగడ టిడిపిలోకి వస్తే అది ఆయన సాధించిన విజయం అవుతుంది. ఏతావాతా కాపు ఉద్యమంతో నాయకుడైపోదామనుకుంటే అదీ అందక, రాజకీయాల్లోనూ తనను ఎవరూ గుర్తించక రెంటికీ చెడ్డ రేవడి అయిపోయారు ముద్రగడ.