కయ్యమా,వియ్యమా: బాబు దారెటు ?

ప్రత్యేక హోదా అనే పదాన్ని వినడానికి కూడా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇష్టపడటంలేదు. ఆ ఎన్‌డిఎ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగమే. రాజ్యసభలో ఈ రోజు జరగాల్సిన ఓటింగ్‌ని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా జరగనీయలేదు.

కానీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదా బిల్లుకి అనుకూలంగా ఓటేయడానికి సిద్ధమైంది. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో. బిజెపి నుంచి ‘బిల్లుపై ఓటింగ్‌ జరగనీయం’ అని హామీ వచ్చిన తర్వాతే, ‘ఆ బిల్లుకి అనుకూలంగా ఓటేస్తాం’ అనే మాట తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిందని భావించాలి. లేదంటే, ‘అది ఎందుకూ పనికిరాని బిల్లు’ అని కేంద్ర మంత్రి, టిడిపి నాయకుడు సుజనా చౌదరి, బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా సభ వాయిదా పడిన అనంతరం అంత తేలిగ్గా ఎలా వ్యాఖ్యానించగలరు? ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిజెపి వ్యతిరేకం అనే సంకేతాలు నేటి రాజకీయ పరిణామాలతో వెళ్ళాయి. అదే తరహా వ్యతిరేకత ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీ కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ప్రత్యేక హోదా సాధిస్తాం, అది అవసరం అని ఇప్పటికి కూడా చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. కాని బిజెపి వైఖరి ఇప్పుడు తాజాగా అర్థమయ్యాక, చంద్రబాబు ఇంకా బిజెపితో రాసుకుపూసుకు తిరగడం రాజకీయంగా ఆయనకు పెద్ద దెబ్బ అనే భావించాల్సి ఉంటుంది. కానీ బిజెపితో తెగతెంపులు చేసుకోవడం చంద్రబాబుకి అంత తేలిక కాదు. వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆయనకు బిజెపితో అవసరాలున్నాయ్‌ మరి.