ఆ 21 మంది అక్కడికే వెళ్ళారా?

కేరళ నుంచి ఆచూకీ తెలియకుండా పోయిన 21 మంది ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్టు తెలుస్తున్నది. రాష్ట్రం నుంచి 21 మంది అదృశ్యమైన మాట నిజమేనని సీఎం పినరై విజయన్ అంగీకరించారు. అదృశ్యమైన వారిలో ఇద్దరు యువకులకు తండ్రియైన ఓ క్రైస్తవుడు తన కుమారులు ముస్లిం మత ప్రచారకుడు జకీర్ నాయిక్‌తో నిత్యం సంప్రదింపులు జరిపే వారని చెప్పారు. దీంతో కేరళలో ఐస్ కార్యకలాపాలపై అనుమానాలు బలపడుతున్నాయి.

సీఎం విజయన్  రాష్ట్రం నుంచి 21 మంది అదృశ్యమయ్యారని, వారిలో 17 మంది కాసర్‌గోడ్‌కు చెందిన వారు కాగా, నలుగురు పాలక్కడ్‌కు చెందినవారని తెలిపారు. ఈ 21 మందిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి మతం లేదని, 21 మంది అదృశ్యమైన విషయాన్ని ఆసరా చేసుకొని రాష్ట్రంలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే సహించబోమని విజయన్ హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, పాలక్కడ్ నుంచి కనిపించకుండా పోయినా యాహ్యా, ఈజాల తండ్రి కే విన్సెట్ ఓ మలయాళం న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ, తన కుమారులు వివాదాస్పద ముస్లిం మత ప్రచారకుడు జకీర్ నాయక్‌ను నిత్యం కలుస్తుండే వారని చెప్పారు.ఐఎస్ ఉగ్రవాద సంస్థ మాలే భాషలో ఓ వార్తా పత్రికను ప్రారంభించడం ద్వారా ఆగ్నేయాసియాలో విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నది. గత నెల 20న ఫిలిప్పైన్స్‌లో అల్ ఫతీహిన (అరబిక్‌లో విజేత) పేరిట పత్రికన ప్రారంభించింది.