రామ్‌చరణ్‌కి మెగా టెన్షన్‌

రాజకీయాల నుంచి కొంచెం గ్యాప్‌ తీసుకుని ఇప్పుడే చిరంజీవి తన 150వ సినిమా మీద దృష్టి పెట్టాడు. తన బాడీ లాంగ్వేజ్‌నంతటినీ సినిమా హీరోకి తగ్గట్టుగా మార్చుకున్నాడు. ఇంక రేపో, మాపో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఈలోగా రాజకీయాల వైపు నుంచి వచ్చే ఉపద్రవాలు చిరంజీవిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా తన టైం అంతా రాజకీయాలకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. కాపు ఉద్యమంతో చిరంజీవి ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచిస్తూ అక్కడే తన టైం కేటాయించాల్సి వస్తోంది. దాంతో చిరంజీవి సినిమాకి నిర్మాత అయిన చరణ్‌కి టెన్షన్‌ పట్టుకుంది.

రాజకీయాలపై ఇంట్రెస్ట్‌ పెడితే వివాదాలు తప్పవు. మాల మహానాడు ఇప్పటికే చిరంజీవికి అల్టిమేటం ఇచ్చింది. కాపు వర్గీకరణకి అనుకూలమని ప్రకటించడం ద్వారా తమకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ చిరంజీవిని తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వబోమంటున్నారు మాల మహానాడు నాయకులు. ఈ హెచ్చరికలు సినిమాపై ఏరకమైన ప్రభావం చూపిస్తాయో అని చరణ్‌ తెగ టెన్షన్‌ పడుతున్నాడట. ఇప్పటికే చూసి చూసి ఇన్నాళ్లకి సినిమా సెట్స్‌ మీదికి వెళ్తోందన్న టైంలో చిరంజీవికి రాజకీయంగా ఇలాంటి సమస్యలు తలెత్తడంతో నిర్మాతగా చరణ్‌కి ఏం చెయ్యాలో తెలియడం లేదుట. ఈ తతంగం అంతా సర్దుమణిగితేగానీ, చిరు సినిమా సంగతి తేలేలా కనిపించడం లేదు. అంటే ఇంకొంతకాలం చిరంజీవి సినిమా కోసం అభిమానులు ఎదురుచూడక తప్పదా?