తొండంలేని గణపయ్య ఆల‌యం.. ఎలుకల చెవిలో కోరికలు చెబితే తీర్చే గర్ గణేష్..

విఘ్నాలను తొలగించే గణపయ్యకే ముందుగా హిందువులు పూజ చేస్తారు. గణేష్, విగ్నేష్, బొజ్జ గణపయ్య, వక్రతుండాయ, గజాననయ అంటూ పలు రకాల పేర్లతో పూజిస్తూ ఉంటారు. ఇక తొండం తిరిగి ఉన్న దిశను బట్టి ఆయన పేరును కూడా నిర్ణయిస్తారు. కుడి వైపు వినాయకుడి తొండం తిరిగి ఉంటే లక్ష్మీ గణపతి, తొండం లోపలకు మడిచినట్లుగా ఉంటే తప్పో గణపతి అని అంటూ ఉంటారు. ఇక తొండం ముందుకు ఉంటే ఆ విగ్రహానికి పూజలు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు. ఎడమవైపు తొండం ఉన్న విగ్నేషుడు గౌరీదేవిని చూపిస్తున్నట్లు వేదాలు చెబుతున్నాయి.

కనుక ఇంట్లో ప్రతిష్టించుకునే గణపతిని ఎడమవైపు తొండం ఉండే విధంగా చూసుకోవాలట. కేవలం కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని గుళ్ళలో మాత్రమే ప్రతిష్టిస్తారు. ఇలా తొండంని బట్టి గణేశుని పూజిస్తారు. కానీ అసలు తొండమేలేని గణపయ్య ఉన్నారని.. ఆయనకు ఒక ఆలయం ఉందని చాలామందికి తెలియదు. అదే మన భారతదేశంలో ఉన్న గర్ గ‌ణేష్ ఆలయం. వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయంలో తొండం లేదని గణపతి ఫోటోలను 300 ఏళ్ళ‌వరకు బయటకు రానివ్వలేదు. 365 మెట్లు ఎక్కి వెళ్లి ఈ గణపతిని దర్శించాలి. జైపూర్ లో ఈ ఆలయం ఉంది.

ఈ ఆలయంలో ఫోటోలు నిషేధం. కేవలం తొండంలేని గణపతి అనే కారణంతోనే వినాయకుని ఫొటోస్ తీయడానికి ఇక్కడ ఆలయ పెద్దలు నిషేధించారట. 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి వినాయక చవితి రోజున కోట్లాదిమంది భక్తులు పోటేత్తుతారు. ఆరోజు దర్శనానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 18వ శతాబ్దంలో జైపూర్ స్థాపన కోసం సవాయి జై సింగ్ గుజరాత్ నుంచి పండితులను ఇక్కడకు పిలిపించి అశ్వమేధ యాగం నిర్వహించి మరి ఆలయాన్ని స్థాపించాడట. గణేశుని కళ్ళు చెక్కుచెదరకుండా ఆయన ఆశీర్వాదం జైపూర్ కు ఎల్లప్పుడూ ఉండాలని గణేష్ ని విగ్రహాన్ని ఉత్తర దిశగా ప్రతిష్టించారట.

ఇక ఈ గణేశుని ఫోటోను ఆలయ నిర్వాహకులు కూడా 300 ఏళ్ల వరకు బయటకు రానివ్వలేదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆలయాల్లో రాజ్ సిటీ ప్యాలెస్ నుంచి నిలబడి హారతి దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం గమనార్హం. కొండపై ఉన్న గర్ గణేష్, గోవిందదేవ టెంపుల్, సిటీ ప్యాలెస్, ఆల్బర్ట్ హాల్ ఒకదానికి ఒకటి సమాంతరంగా ఒకే దిశలో ఉంటాయి. దూరం నుంచి ఏ ప్రదేశం నుంచైనా మిగతా వాటిని చూసే విధంగా వీటిని నిర్మించారు.

ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు చీటీలో రాసి ఆయన పాదాల దగ్గర ఉంచుతారు. అంతేకాదు ఆలయ ప్రధాన ద్వారం వద్ద 2 ఎలుకలు ఉంటాయి. ఆ ఎలుకల చెవిలో భక్తులు తమ కోరికలను చెబుతారు. గణేశునికి ఆ ఎలుకలు వారి కోరికలను చేరవేస్తాయని.. అలా చెబితే వారి కోరికలు కచ్చితంగా తీరుతాయని అక్కడి భక్తులు నమ్ముతారు. 7 వారాలు ప్రతి బుధవారం గణేష్ ని దర్శించుకుంటే వారి కోరికలు తీరుతాయని వారి నమ్మకం.