నటుడు నాజర్ ఇంట విషాదం..!

తెలుగు, తమిళ్ అంటూ తేడా లేకుండా వరుసగా నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే తాజాగా ఆయన ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన తండ్రి మాబూబ్ బాషా (94) సంవత్సరాల వయసులో స్వర్గస్తులయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్ధాప్యంతో కూడా బాధపడుతున్న ఆయన తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్ మలై వీధిలో ఉన్న తన స్వగృహంలో కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.

 

ఇక ఆయన మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నాజర్ నటుడిగా రాణించడానికి నటనలో స్థిరపడడానికి ఆయన తండ్రి మొదటి కారణం.. తండ్రి కోరిక మేరకు ఇన్స్టిట్యూట్ లో చేరిన నాజర్ ఆ తర్వాత దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నారు. అయితే ఇండస్ట్రీలో నటనలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అవకాశాలు రాకపోవడంతో చెన్నైలో ఉన్న ఒక పెద్ద హోటల్లో సప్లయర్ గా చేరి ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు మళ్ళీ సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు కూడా..

ఇప్పటికే తెలుగులో ఎన్నో చిత్రాలు చేసిన నాజర్ అటు తమిళంలో కూడా భారీ విజయాలను అందుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆయనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అంతే కాదు హిందీలో కూడా నటిస్తున్నారు వరుస అవకాశాలు అందుకుంటూ తండ్రి కోరికను నిజం చేసిన నాజర్ ఇప్పుడు ఆ తండ్రి లేకపోవడంతో మరింత దిగ్బ్రాంతికి లోనయ్యారు. తన తండ్రి లేడు అన్న వార్తను తెలుసుకొని ఆయన మరింత కృంగిపోతున్నారని సమాచారం. ఇకపోతే నాజర్ తండ్రి మాబూబ్ బాషా అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.