చిన్నపిల్లలకి అతి సౌకర్యం.. ఫ్యూచర్‌కి అధిక ముప్పు..

ఇటీవల కాలంలో తల్లిదండ్రు ఇద్దరు కూడా పనుల ఒత్తిడిలో పడిపోయి పిల్లలకు సరైన సమయం కేటాయించడం లేదు. ఇదే ఆలోచనతో పిల్లలను గారం చేస్తూ వారు ఏది అడిగితే అది తెచ్చి పెట్టేస్తున్నారు. భాగస్వాములో ఒకరు అది వద్దని చెప్పినా సరే ఇంకొకరు వారితో గొడవపడి మరి పిల్లలు అడిగినదాన్ని తీసుకువచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా అధిక గారాబం వల్ల పిల్లలు చెడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

ఇలా వారు అడిగినప్పుడల్లా అడిగింది చేస్తూ ఉంటే మీ బలహీనతను వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకే వారి పెంపకం విషయంలో భాగస్వాములు ఇద్దరు ఒకే మాటపై ఉండాలి. మంచి నడవడిక, విలువలు, గౌరవ మర్యాదలు పిల్లలకు ముందు నుంచే నేర్పుకోవాలి. 5, 6 ఏళ్ళు వచ్చినప్పటి నుంచే వారికి ప్రతిదీ అలవాటు చేయాలి. మంచి అలవాట్లను నేర్పించడం వల్ల పిల్లలు ఎదిగేకొద్దీ వారిలో ఆ లక్షణాలు ఇమిడిపోతాయి.

అంతేకానీ ముందంతా ముద్దు చేసి ఒక్కసారిగా హద్దులు పెట్టడం కూడా పిల్లలకు మంచిది కాదు. ఒకసారిగా మీ ప్రవర్తనలో వచ్చే మార్పును వాళ్లు తీసుకోలేక పోతారు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. గాయపడతారని తోటి పిల్లలతో ఆడుకోవడానికి పంపకుండా ఉంటారు కొంతమంది. అయితే అలా నలుగురితో కలిసి ఆడుకునే విధంగానే పిల్లలను పెంచాలి దాని వల్ల అందరితో కలవగలిగే నైపుణ్యం పెరుగుతుంది.

అదేవిధంగా ఇతర మత, కులా, ఆర్థిక పరిస్థితులను కించపరిచే విధంగా పిల్లల ముందు మాట్లాడకూడదు. ఇది వారి ఆలోచన విధానం పై పడుతుంది. తప్పుడు మార్గంలో నడిపిస్తుంది. వారి మనసు చిన్నప్పటి నుంచే ఎంతో స్వచ్చంగా ఉంటే పెద్దయ్యాక వారి ఆలోచనలు కూడా ఎంతో నిర్మలంగా ఉంటాయి. దీన్నిబట్టి ముందు నుంచే వారికి అతి సౌకర్యాలను కల్పించకూడదు. కష్టం, సుఖం, విలువలు తెలిసే విధంగా చిన్నప్పటి నుంచే పిల్లలను తయారు చేయాలి. అతిగారాభం పిల్లలకు అసలు మంచిది కాదు దీనివల్ల పిల్లలపై మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.