గుంటూరు ఎంపీ అభ్యర్థి కోసం టీడీపీ వేట…!

గుంటూరు పార్లమెంట్ స్థానానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగ లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ హవాలో సైతం గల్లా జయదేవ్ గెలిచారు. ఈ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి గెలిచేందుకు టీడీపీ ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్లుతెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం… గల్లా జయదేవ్ కుటుంబం నిర్వహిస్తున్న అమర్‌రాజ బ్యాటరీ సంస్థల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అని తెలుస్తోంది. పర్యావరణానికి హాని కలిగిస్తోందంటూ అమర్‌రాజ సంస్థపై జగన్ సర్కార్ చర్యలు తీసుకుంది. దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేసిన అమర్‌రాజ సంస్థ… చివరికి తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి ఆర్థికంగా అండగా ఉంటున్నారనే గల్లా కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ నేతలు విమర్శించారు కూడా.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేంందుకు తాను సిద్ధంగా లేనని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం గల్లా జయదేవ్ చెప్పినట్లు సమాచారం. అందుకే ఇటీవల జరిగిన లోకేశ్ పాదయాత్రలో కూడా గల్లా పాల్గొనలేదు. దీంతో గల్లా పోటీ చేసేది లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ముందుగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆలపాటి తెనాలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పేరును పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. పొత్తు కుదిరితే.. తెనాలిని జనసేనకు ఇవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో ఆలపాటిని గుంటూరు నుంచి పోటీ చేయిస్తే బెటరని చంద్రబాబు భావిస్తున్నారు. అంతకు ముందు ప్రముఖ విద్యా సంస్థ అధిపతి పేరును పరిశీలించినప్పటికీ… ఆయన నో చెప్పడంతో… ఆలపాటిని రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు.

వాస్తవానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రభావం గుంటూరు పార్లమెంట్‌పై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. గత ఎన్నికల్లో కూడా గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ తరఫున మద్దాలి గిరి విజయం సాధించారు. అయితే ఆయన అనూహ్యంగా వైసీపీకి మద్దతు తెలిపారు. దీంతో గుంటూరు పశ్చిమ నుంచి ఎవరిని పోటీలో నిలపాలనేది ప్రస్తుతం టీడీపీ ముందు ఉన్న ప్రశ్న. రాజధాని పరిధిలోని పార్లమెంట్ స్థానం కావడంతో… ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరులో టీడీపీ గెలుస్తుందని… హ్యాట్రిక్ సాధిస్తుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.