పట్నంకు మంత్రి.. తుమ్మల-తీగల పొజిషన్ ఏంటి?

మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించి కే‌సి‌ఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. 119 సీట్లకు గాను..ఒక్కసారే 115 సీట్లలో అభ్యర్ధులని ప్రకటించారు. ఒక 9 చోట్ల సిట్టింగ్ సీట్లలో మినహా మిగతా సీట్లలో సిట్టింగులకు ఛాన్స్ ఇచ్చారు. అటు కాంగ్రెస్, ఎం‌ఐ‌ఎం, బి‌జే‌పి సిట్టింగ్ సీట్లలో బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది, టి‌డి‌పి నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

యథావిధిగా వారికి సీట్లు కేటాయించారు. దీంతో ఆయా సీట్లలో ఉన్న బి‌ఆర్‌ఎస్ సీనియర్ నేతల పరిస్తితి ఏంటి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సీనియర్లని ఒప్పించే సీట్లు ప్రకటించినట్లు కే‌సిఆర్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాండూరు సీటు పైలట్ రోహిత్ రెడ్డికి కేటాయించారు. అక్కడ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించారు. అలాగే రోహిత్, పట్నంలని కలిపారు. రోహిత్ సైతం..పట్నం ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇదే సమయంలో పట్నంకు మంత్రి పదవి ఇస్తారని టాక్ నడుస్టోని. ఇంకా ఎన్నికలకు ఎలా చూసుకున్న మూడు నెలల సమయం ఉంది..ఈలోపు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఎలాగో ఈటల  రాజేందర్ తప్పుకున్నాక..ఒక మంత్రి పదవి ఖాళీగానే ఉంది. ఇప్పుడు దాన్ని పట్నంకు ఇస్తారని టాక్. మరి పట్నంకు మంత్రి పదవి ఇస్తే తీగల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల పరిస్తితి ఏంటి అనేది ప్రశ్న. తీగల ఉన్న మహేశ్వరం సీటు సబితా ఇంద్రారెడ్డికి, తుమ్మల ఉన్న పాలేరు సీటు ఉపేందర్ రెడ్డికి కేటాయించారు. దీంతో తుమ్మల, తీగలలకు వేరే పదవులు ఇస్తారా? మళ్ళీ ప్రభుత్వం వస్తే మంత్రి పదవులు ఇస్తారా? అనేది చూడాలి. అది కాదు అనుకుంటే తీగల, తుమ్మల వీలు చూసుకుని వేరే పార్టీల్లోకి జంప్ అవుతారేమో చూడాలి.