వాలంటీర్లని వదలని పవన్..జగన్‌కు ఊడిగం చేస్తారా?

వైసీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కొందరు మహిళలు కనపడకుండా పోతున్నారని..ముఖ్యంగా కుటుంబాల్లో మహిళలు, వితంతువుల సమాచారాన్ని వాలంటీర్లు సేకరించి..సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు పవన్ పై ఫైర్ అవుతున్నారు. అలాగే పవన్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అటు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

అయినా సరే పవన్ వెనక్కి తగ్గడం లేదు..తాను అన్నది కరెక్ట్ అని..కాకపోతే అందరు వాలంటీర్లని అనడం లేదని కొందరు అలాంటి పనులే చేస్తున్నారని, కేంద్ర సంస్థలు తనకు సమాచారం ఇచ్చాయని అంటున్నారు. వాలంటీర్ల పొట్ట కొట్టాలని తనకు లేదని, కొందరు చేస్తున్న ఘాతుకాలనే ప్రజల దృష్టికి తెచ్చానని తెలిపారు. వంద తాజా పండ్లలో ఒక్కటి కుళ్లినా అన్నీ పాడైపోతాయని చెప్పారు. ప్రజలను నియంత్రించేందుకు, బెదిరించేందుకే వలంటీర్‌ వ్యవస్థను జగన్‌ డిజైన్‌ చేసి వదిలాడని.. అందుకే అన్ని పార్టీల నాయకులు ఈ వలంటీర్లపై, వాళ్లు సేకరిస్తోన్న వివరాలపై ఒక కన్నేసి ఉంచాలని అన్నారు.

ఇక తన పార్టీ మహిళనో, తన ఫ్యామిలీ మహిళనో, మాజీ సీఎం చంద్రబాబు సతీమణినో తిడితే ఆ ఒక్కరే కాదు.. అందరూ స్పందించాలని చెప్పుకొచ్చారు. అలాగే డిగ్రీలు చదువుకున్న యువత కేవలం రూ.5,200 కోసం జగన్‌కు ఊడిగం చేయాలా? కనీసం ఉపాధి హామీకి ఇస్తున్నంత కూడా రావట్లేదే? అని ప్రశ్నించారు. అయితే జగన్ తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థపై అనేక రకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి.

కొన్ని చోట్ల మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నట్లు, పింఛన్ డబ్బులు పట్టుకుని పారిపోయినట్లు, వేరే పార్టీ వాళ్ళని బెదిరించడం, పథకాలు పోతాయని భయపెట్టడం లాంటివి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు పవన్ రాష్ట్రంలో మిస్ అవుతున్న మహిళలకు కారణం వాలంటీర్లు అంటున్నారు. మొత్తానికి వాలంటీర్లని పవన్ వదలడం లేదు.