పవన్ రెడీ..జనసేనకు కలిసొస్తుందా?

చాలా రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వస్తున్నారు. ఎప్పుడో  పార్టీ ఆవిర్భావ సమయంలో కనిపించారు. ఆ తర్వాత వర్షాల వల్ల నష్టపోయిన రైతులని పరామర్శించేందుకు వచ్చారు. ఇంకా అంతే ఆయన పార్టీ పరమైన కార్యక్రమాలు గాని, పార్టీ కోసం జనంలో తిరగడం చేయలేదు. పూర్తిగా సినిమా షూటింగుల్లో బిజీగా ఉండిపోయారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ అలెర్ట్ అయ్యారు.

ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. ఓ వైపు చంద్రబాబు, మరో వైపు జగన్ ప్రజల్లో ఉంటున్నారు. అటు నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. వారి వారి పార్టీలని బలోపేతం చేసుకుంటున్నారు. కానీ పవన్ అలా చేయడం లేదు. దీని వల్ల క్షేత్ర స్థాయిలో జనసేన వెనుకబడింది..అలాగే జనసేనకు బలమైన చోట్ల కూడా ఇబ్బంది పడే పరిస్తితి. అందుకే పవన్ డైరక్ట్ రంగంలోకి దిగుతున్నారు. తన వారాహి బస్సుతో ప్రజల్లోకి వస్తున్నారు. రేపటి నుంచి అన్నవరంలో పూజలు చేయించి..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నుంచి ప్రజా యాత్ర మొదలుపెట్టనున్నారు.

అక్కడ నుంచి  పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. ఇక అన్నీ స్థానాలు జనసేనకు పట్టున్న స్థానాలే. అలాగే టి‌డి‌పితో పొత్తు ఉంటే ఈ సీట్లని జనసేన తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సీట్లలో పర్యటించి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా..అక్కడ ప్రజా సమస్యలని తెలుసుకోవడం, వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టడం చేయనున్నారు.

ఇది మొదట విడత యాత్ర మాత్రమే..ఇంకా సినిమా షూటింగులు ముగించుకుని మళ్ళీ పవన్ ప్రజల్లోకి వస్తుంటారు. ఇక పవన్ డైరక్టర్లు, నిర్మాతలు సైతం..అమరావతి చుట్టూ పక్కల, దాదాపు ఏపీలో సినిమా షూటింగులు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే పవన్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడనున్నారు.