బద్వేలులో టీడీపీ కష్టాలు..వైసీపీకి చెక్ కష్టమే.!

రాయలసీమలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిన విషయం తెలిసిందే. సీమలో పాదయాత్ర ముగింపు బద్వేలు నియోజకవర్గంలో జరిగింది. ముగింపు సభలో భారీ ఎత్తున జనం వచ్చారు. అయితే ఆ స్థాయిలో జనం వస్తారని టి‌డి‌పి వాళ్ళు ఊహించి ఉండరు. ఎందుకంటే బద్వేలు అంటే వైసీపీ కంచుకోట. అలాంటి చోట టి‌డి‌పికి మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన నేపథ్యంలో ఈ సారి బద్వేలుని ఖచ్చితంగా గెలిచి తీరాలని టి‌డి‌పి నేతలకు నారా లోకేష్ సూచనలు చేశారు.

నాయకులకు క్లాస్ కూడా ఇచ్చారు. వరుసగా ఇక్కడ ఓటములే వస్తున్నాయని, నేతలు సొంత పనులు పక్కన పెట్టి..నియోజకవర్గంలోని ప్రజలతో తిరగాలని, అప్పుడు పార్టీ బలోపేతం అవుతుందని చెప్పారు. తనకు లాస్ట్ రోజు బద్వేలు నేతలు సన్మానం చేస్తున్న సమయంలో..బద్వేలు గెలిస్తే తానే మీకు సన్మానం చేస్తానని లోకేష్..టి‌డి‌పి నేతలకు చెప్పారు. మొత్తానికి ఈ సారి బద్వేలు గెలవడమే టి‌డి‌పి నేతలు టార్గెట్ అయింది.

కానీ బద్వేలులో టి‌డి‌పి గెలవడం సులువా? అంటే కష్టమనే చెప్పాలి. గతంలో ఇక్కడ టి‌డి‌పి రాణించింది. 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలిచింది. కానీ 2004 నుంచి వరుసగా ఓటములే. 2014 నుంచి వైసీపీ కంచుకోటగా మారిపోయింది. అక్కడ రెడ్డి, ఎస్సీ సామాజికవర్గం వైసీపీ వైపే ఉంటున్నారు. దీంతో టి‌డి‌పి గెలవడం లేదు.

అయితే ఈ సారి ఎస్సీ ఓటర్లని తమ వైపుకు తిప్పుకోవాలని చెప్పి టి‌డి‌పి ప్లాన్ చేస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు ఒరిగింది ఏమి లేదని, ఇక జగన్ తన సొంత సామాజికవర్గం రెడ్డి వర్గానికి చేసిందేమి లేదని అంటున్నారు. ఆ రెండు వర్గాలని సగం తిప్పుకున్న చాలు బద్వేలులో గెలవచ్చు. కానీ వారు ఎంతవరకు టి‌డి‌పికి ఓటు వేస్తారో చూడాలి.