పాత కాలంనాటి ట్రెండ్‌కు ఊపిరి పోసిన బలగం మూవీ.. అదేంటంటే..

ఒకప్పుడు అంటే 1980 కాలంలో ఊర్లలోనే రాత్రి సమయంలో రోడ్లపై తెర కట్టి దానిపై సినిమా వేసే వారు. ఆ సినిమా చూడానికి చిన్నవాళ్ల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకూ అందరూ ఒక దగ్గరకు చేరి సినిమాను చూసేవారు. ఆ తరువాత ప్రతీ ఇంటికీ టీవీ రావడంతో జనాలు రోడ్డు మీదకి రావడం మానేశారు. ఇక ఇప్పుడేమో రకరకాల ఓటీటీ సంస్థలు వచ్చాయి. దాంతో అపుడప్పుడు థియేటర్స్‌కి వెళ్లే వాళ్ళు కూడా మానేశారు.

అయితే పాత రోజులను గుర్తు చేసేలా ఇప్పుడు ఒక సినిమా వచ్చింది. అదే జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా. ఆ సినిమాని తమ ఊరి ప్రజలకు చూపించడం కోసం మారుమూల గ్రామాలలోని సర్పంచులు, పెద్దమనుషులు లాంటి వారు తమ ఊర్లో ఉన్న ఖాళీ ప్రదేశాలో పెద్ద స్క్రీన్ పెట్టి గ్రామ ప్రజలకు బలగం సినిమా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇదంతా హాట్ టాపిక్ గా మారింది. షో వేస్తున్నామని ముందుగానే ఊర్లలో చాటింపు వేయిస్తున్నారు. దాంతో చిన్న పెద్ద అందరూ రాత్రి సమయానికి అందరూ ఆ తెర వద్దకు చేరి కలిసి కట్టుగా సినిమా చూస్తున్నారు. సినిమా చూసినా ప్రతీ ఒక్కరు కంట తడి పెట్టుకుంటున్నారని వార్తలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి.

రెడ్డి పేట, సంగం, ముద్దపూర్, దుద్దేడా, లక్ష్మణ్ చందా రాగన్నగూడెం ఇలా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో బలగం సినిమాకి సంబంధించిన ప్రత్యేక షోలు వేస్తున్నారు. ఇలాంటి గ్రామాల చుట్టుపక్కలో ఎక్కడా కూడా థియేటర్స్ లేకపోవడంతో ఆ ఊర్లలోని సర్పంచులు, పెద్దమనుషులు, యువకులు అందరూ ఒకటై బలగం సినిమా కోసం ప్రత్యేకంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి బలగం సినిమాకి ఇంతటి స్పందన వస్తుందని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఊహించలేదు. కేవలం 4 కోట్లతో తీసిన బడ్జెట్‌కి ఏకంగా 20 కోట్లు వసూలు చేయడం అనేది మాములు విషయం కాదు. ప్రస్తుతం బలగం సినిమా, ఆ చిత్ర దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారారు.