సత్తెనపల్లెలో అంబటికి సెగలు..సీటుపై మరో నేత పట్టు!

వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. పైగా కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఉండదని జగన్ చెబుతున్నా నేపథ్యంలో ఆయా సీట్లని దక్కించుకునేందుకు కొందరు వైసీపీ నేతలు ట్రై చేస్తున్నారు. ఇదే క్రమంలో సత్తెనపల్లె సీటు విషయంలో అంబటి రాంబాబుకు అసంతృప్తి సెగలు మొదలయ్యాయి.

ఈ సీటు కోసం మరో నేత పోటీ పడుతున్నారు. తాజాగా అంబటిపై సత్తెనపల్లెకు చెందిన వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మైకులో నాలుగు మాటలు మాట్లాడితే, పది మంది పోలీసులను వెంటేసుకుని తిరిగితే పెద్ద నాయకుడేం కాదని, సత్తెనపల్లి అనాథ బిడ్డ కాదని, ఎవరెవరో వచ్చి సంపాదించుకు వెళ్తున్నారని మంత్రిని ఉద్దేశించి విమర్శించారు. బయట వ్యక్తుల పెత్తనాన్ని నియోజక వర్గంలో సహించేది లేదని, 2024 ఎన్నికల్లో తాను అసెంబ్లీ టికెట్‌ కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు.

ఇక దీనిపై అంబటి స్పందిస్తూ..సీటు కోసం ఎవరైనా ట్రై చేయవచ్చని, సీటు ఎవరికి ఇవ్వాలనేది జగన్ ఇష్టమని, ఆయన సీటు ఎవరికిచ్చిన అభ్యంతరం లేదని రాంబాబు అన్నారు. అలాగే తాను సత్తెనపల్లెలోనే ఉంటానని, ఎక్కడకు వెళ్లాలని అన్నారు. అయితే సత్తెనపల్లెలో అంబటిపై వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు సీటు ఇస్తే నెక్స్ట్ ఓడిపోవడం ఖాయమని సొంత పార్టీ నేతలే భావించే పరిస్తితి. ఈ క్రమంలోనే ఆ సీటు కోసం వేరే నేత ట్రై చేస్తున్నారు. చూడాలి మరి చివరికి సత్తెనపల్లె సీటు ఎవరికి దక్కుతుందో.