నేను బ్రతికున్నా అంటే ఆమె వల్లే.. శివబాలాజీ కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా శివబాలాజీకి మంచి పేరు ఉంది. ఇక 2004లో వచ్చిన ఆర్య సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్, అనుమెహతా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందులో కొంచెం నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో శివబాలాజీ నటించారు. ఈ సినిమా ఆయనకు ఎంతగానో పేరు తెచ్చింది. కొన్నాళ్ల క్రిందట పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు సినిమాలోనూ ఆయన తమ్ముడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. మరో వైపు యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా వచ్చిన పుట్టింటికి రావే చెల్లి సినిమాలో ఆయన చెల్లి పాత్రలో మధుమిత అందరినీ కంటతడి పెట్టించింది. ఆమెను శివబాలాజీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన జీవితంలోకి వచ్చాక తాను చాలా మారానని, ముఖ్యంగా చనిపోవాలనుకున్నప్పుడు ఆమె ఇచ్చిన ధైర్యంతోనే సమస్యల నుంచి బయటపడ్డానని చెప్పాడు.

శివబాలాజీ-మధుమిత జంట తరచూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. అంతేకాకుండా సామాజిక సమస్యలపైనా పోరాడుతుంటారు. స్కూలు ఫీజుల విషయంలో వీరు తమ గొంతెత్తి అందరికీ ఆదర్శంగా మారారు. మరో వైపు శివబాలాజీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో తరచూ పోటీ పడుతుంటాడు. గత ఎన్నికలలో ఆయనను హేమ కొరకడం గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సమయంలో శివబాలాజీ సంయమనంతో వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ సీజన్-1లో ఆయన విజేతగా నిలిచాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపాడు. తాను ఫ్రెండ్స్‌తో కలిసి ఈము పక్షుల ఫాం, పెయిన్ రిలీఫ్ ఆయిల్-సబ్బులు వ్యాపారంలో దిగి లక్షలు నష్టపోయినట్లు వివరించాడు.


ఇక స్నేహమేరా జీవితం అనే సినిమాకు రూ.2 కోట్లు నిర్మాతగా ఖర్చు పెట్టి బాగా లాస్ అయినట్లు వాపోయాడు. ఆ సమయంలో వరుస నష్టాలతో, ఆర్థిక ఇబ్బందులతో చనిపోదామని అనుకున్నట్లు తెలిపాడు. అంత బాధలో ఉన్నప్పుడు భార్య మధుమిత అండగా నిలిచిందని చెప్పాడు. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో జీవితంలో నిలదొక్కుకున్నట్లు వెల్లడించాడు.