ధర్మానని టచ్ చేయలేకపోతున్న టీడీపీ..మళ్ళీ దెబ్బే!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అటు ధర్మాన ప్రసాదరావు, ఇటు ధర్మాన కృష్ణదాస్ దీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ అనేక విజయాలని సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇటు ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి గెలవగా, అటు కృష్ణదాస్ నరసన్నపేట నుంచి గెలిచారు.

ఇక మొదట విడతలో కృష్ణదాస్ మంత్రిగా చేయగా, రెండో విడతలో ప్రసాదరావు మంత్రిగా చేస్తున్నారు. అయితే ఇద్దరు సోదరులు రాజకీయంగా బలమైన వారే. అయితే శ్రీకాకుళంలో టి‌డి‌పి చాలా బలంగా ఉంది. అక్కడ పార్టీ ఆధిక్యంలోకి వచ్చిందని తాజా సర్వేల్లో రుజువైంది. నెక్స్ట్ ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావుకు టి‌డి‌పి చెక్ పెట్టేలా ఉంది. కానీ ధర్మాన కృష్ణదాస్ విషయంలో మాత్రం టి‌డి‌పి వెనుకబడి ఉంది. తాజా సర్వేల్లో మళ్ళీ కృష్ణదాస్ గెలవడం ఖాయమని తేలింది. నరసన్నపేటలో టి‌డి‌పి అంత బలంగా ఉన్నట్లు కనిపించడం లేదు.

మొదట నుంచి శ్రీకాకుళంలో టి‌డి‌పి హవా ఉన్నా సరే నరసన్నపేటలో ఉండేది కాదు. 1985, 1994, 2014 ఎన్నికల్లో మాత్రమే టి‌డి‌పి గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. 1989, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ధర్మాన ప్రసాదరావు గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో కృష్ణదాస్ గెలిచారు. 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి దాస్ గెలిచారు.

2014లో ఓడిపోగా, 2019 ఎన్నికల్లో సత్తా చాటారు. ఇప్పటికీ ఆయన అక్కడ బలంగా ఉన్నారు. ఎక్కడకక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తుంటే..కృష్ణదాస్ పై ఆ స్థాయిలో వ్యతిరేకత పెరిగినట్లు కనిపించడం లేదు. దీంతో నరసన్నపేటలో టి‌డి‌పి గెలుపు మళ్ళీ అసాధ్యమని తెలుస్తోంది.