కోటంరెడ్డి ఎంట్రీ..నెల్లూరు రూరల్ సీటులో కన్ఫ్యూజన్..!

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టి‌డి‌పిలో చేరడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..టి‌డి‌పిలో చేరిపోయారు. అయితే ఎమ్మెల్యే పదవి ఉండటంతో కోటంరెడ్డి ఇంకా టి‌డి‌పిలో చేరలేదు..కానీ వైసీపీకి మాత్రం దూరం జరిగారు. ఎన్నికల ముందు ఆయన టి‌డి‌పిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక కోటంరెడ్డి ఎంట్రీ వల్ల నెల్లూరు రూరల్  టి‌డి‌పిలో ఏమైనా తలనొప్పులు వస్తాయా? అనేది చూడాల్సి ఉంది.

ఎందుకంటే అక్కడ ఇంచార్జ్ గా అబ్దుల్ అజీజ్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనే టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే వాస్తవానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి టి‌డి‌పి నుంచి పోటీ చేయాలి..కానీ ఆయన చివరి నిమిషంలో పార్టీ నుంచి జంప్ అయ్యారు..దీంతో అజీజ్‌ని అభ్యర్ధిగా పెట్టారు. ఇక అజీజ్..కోటంరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అదే కోటంరెడ్డి టి‌డి‌పి వైపుకు వస్తున్నారు. దీంతో అజీజ్ సీటు కోసం పట్టు పట్టే పరిస్తితి ఉంది.

ఇదే క్రమంలో తాజాగా ఆయన చందబాబుని కలిశారు. ఈక్రమంలో బాబు..సీటు గురించి ఇప్పుడేమీ ఆలోచించవద్దని, ఎన్నికల సమయంలో చూసుకుందామని చెప్పుకొచ్చారు. టీడీపీని మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, దీనిని పార్టీ శ్రేణులు స్వాగతించాలని చంద్రబాబు సూచించారు. ప్రజలు టీడీపీని కోరుకుంటున్నారని, ఈ సమయంలో ప్రజలకు పార్టీ పట్ల నమ్మకం పెంచేలా అంకితభావంతో పని చేయాలని, అనవసరమైన ఆందోళనలు మనసులో పెట్టుకోకుండా ఉత్సాహంగా పని చేయాలని అజీజ్‌కు భరోసా ఇచ్చినట్లు తెలిసింది.

టికెట్ల విషయం ఎన్నికలప్పుడు మాట్లాడుకుందామని, దానికి ఇంకా చాలా సమయం ఉందని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. అయితే కోటంరెడ్డికే నెల్లూరు రూరల్ ఫిక్స్ చేయడం ఖాయం…మరి అజీజ్‌ని వేరే చోటకు పంపుతారా? లేక నెల్లూరు ఎంపీ సీటు ఇస్తారా? అనేది చూడాలి.