మేకపాటి దూకుడు..వైసీపీ ప్లాన్ బెడిసికొడుతుందా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారని అనుమానిస్తూ..వైసీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..ఈ నలుగురుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఎన్నికల ముందే ఆనం, కోటంరెడ్డి పార్టీకి దూరమయ్యారు. దీంతో వారిని వైసీపీ శ్రేణులు పెద్దగా టార్గెట్ చేయడం లేదు.

ఎలాగో వారిని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ అభ్యర్ధులుగా లెక్కలో వేసుకోలేదు. కానీ మేకపాటి, ఉండవల్లి క్రాస్ ఓటింగ్ చేశారని ఫైర్ అవుతున్నారు. వారిని టార్గెట్ చేసుకుని ఇప్పుడు వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే తాడికొండలో శ్రీదేవి కార్యలయంపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఆమె భయంతో హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఇటు ఉదయగిరిలో మేకపాటిని సైతం టార్గెట్ చేశారు. కానీ ఆయన డేర్‌గా నిలబడుతూ.వైసీపీపై విరుచుకుపడుతున్నారు.

తాజాగా ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో వైసీపీ నేతలు, శ్రేణులు.మేకపాటి టార్గెట్ గా ర్యాలీ చేశారు. మీరు చేసింది ముమ్మాటికీ తప్పే.. అది జగమెరిగిన సత్యం.. అధిష్ఠానం తీసుకొన్న నిర్ణయం సబబే.. మీకు ఇక్కడ స్థానం లేదని, నియోజకవర్గం వదిలి వెళ్లిపోండి.. లేదంటే తరువాత జరిగే పరిణామాలకు ఎవరూ బాధ్యులు కారని వైసీపీ నేతలు..మేకపాటికి వార్నింగ్ ఇచ్చారు.

అయితే మేకపాటి కూడా ఏ మాత్రం తగ్గకుండా..వైసీపీ శ్రేణులకు ధీటుగా వార్నింగ్ ఇచ్చారు. ఆయన బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చుని ఎవరో వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. నాలుగున్నరేళ్ల పదవీకాలం వదులుకొని సొంత డబ్బుతో ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీకి ఎనలేని సేవచేస్తే తనపై అభాండాలు మోపుతున్నారని,  ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొని పార్టీని భ్రష్ఠుపట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. మొత్తానికి మేకపాటి ఎక్కడా తగ్గడం లేదు.