దర్శి సీటుపై నో క్లారిటీ..బాబు ప్లాన్ ఏంటి?

గత మున్సిపల్ ఎన్నికల్లో సంచలన ఫలితం వచ్చిన మున్సిపాలిటీల్లో దర్శి కూడా ఒకటి. రాష్ట్రమంతా వైసీపీ హవా నడుస్తుంటే..దర్శిలో మాత్రం టి‌డి‌పి సత్తా చాటింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టి‌డి‌పి నేతలు కలిసికట్టుగా పనిచేసి దర్శి మున్సిపాలిటీని గెలిపించుకున్నారు. టి‌డి‌పి విజయానికి ఇంచార్జ్ గా పనిచేసిన పమిడి రమేష్ కూడా బాగానే కృషి చేశారు. అలా పార్టీ కోసం పనిచేసిన రమేష్.. తర్వాత ఇంచార్జ్ పదవినే వదులుకున్నారు.

ఎందుకంటే దర్శి సీటు విషయం చంద్రబాబు తేల్చకపోవడంతో..రమేష్ సైడ్ అయిపోయారు. ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. కానీ టి‌డి‌పిని వీడలేదు.అయితే తాజాగా రమేష్..జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. దీంతో దర్శిలో కొత్త ట్విస్ట్ వచ్చింది..పమిడి రమేష్ జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. అలాగే పొత్తులో భాగంగా దర్శి సీటు జనసేనకు దక్కుతుందని, అందుకే రమేష్ జనసేనలో చేరడానికి చూస్తున్నారని ప్రచారం వస్తుంది. కానీ ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో క్లారిటీ లేదు.

ఎందుకంటే దర్శిలో టి‌డి‌పి బలపడింది. ఇక్కడ జనసేనకు పెద్ద ఓటు బ్యాంకు లేదు..గట్టిగా చూసుకుంటే ఓ 15 వేల ఓటు బ్యాంకు కూడా కష్టమే. అలాంటప్పుడు టి‌డి‌పి దర్శి సీటుని వదులుకోవడం కష్టమనే చెప్పాలి. అయితే వైసీపీ నుంచి ఓ కీలక నేత టి‌డి‌పిలోకి వస్తారని అందుకే దర్శి సీటు అలాగే ఉంచారని టాక్ నడుస్తోంది.

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు మళ్ళీ టి‌డి‌పిలోకి వస్తారనే ప్రచారం ఉంది. 2014లో శిద్ధా దర్శి నుంచి టి‌డి‌పి తరుపున పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్లారు. ఇక వైసీపీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన మళ్ళీ టి‌డి‌పి వైపు చూస్తున్నారనే ప్రచారం వస్తుంది. చూడాలి మరి దర్శి సీటు విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో.