సర్వేపల్లిలో బిగ్ ట్విస్ట్..తొలిసారి సోమిరెడ్డికి ఛాన్స్?

రాష్ట్రంలో అదృష్టం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. మొదట్లో ఏదో అదృష్టం కలిసొచ్చి రెండుసార్లు గెలిచారు గాని..ఆ తర్వాత వరుసపెట్టి ఓటములే సోమిరెడ్డిని పలకరించాయి. రెడ్డి వర్గం నేత అయిన సోమిరెడ్డి..చంద్రబాబుకు వీర విధేయుడుగా ఉన్నారు. ఇక ఈయన 1994, 1999 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి గెలిచారు. అప్పట్లోనే మంత్రిగా చేశారు.

ఆ తర్వాత నుంచి సోమిరెడ్డిని ఓటములు పలకరిస్తూనే ఉన్నాయి. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులో ఓడిపోయారు. 2012 కోవూరు ఉపఎన్నికలో వైసీపీ చేతులో ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో సర్వేపల్లిలో వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఇలా అయిదుసార్లు వరుసగా సోమిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో అయిన ఈయన గెలుస్తారా? అంటే అది డౌట్ అనే పరిస్తితి. అంటే సర్వేపల్లిలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయంగా బలంగా ఉన్నారు.

అయితే అది మొన్నటివరకు ఇప్పుడు పరిస్తితి మారిందని, ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం, నియోజకవర్గంలో సరైన అభివృద్ధి చేయకపోవడం లాంటి అంశాలు మైనస్ అవుతున్నాయి. ఇదే సమయంలో సోమిరెడ్డి బలం నిదానంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ అంతర్గత సర్వేల్లోనే కాకాని వెనుకపడ్డారని తెలిసింది.

అదే అంశాన్ని సోమిరెడ్డి కూడా ప్రస్తావిస్తూ..ఇంకా కాకాని వెంకటగిరి వెళ్ళి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని అన్నారు. అయితే వెంకటగిరి వెళ్లకపోవచ్చు గాని..సర్వేపల్లిలోనే మళ్ళీ కాకాని బరిలో దిగే ఛాన్స్ ఉంది..కాకపోతే గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి ఈజీగా గెలవడం కష్టమే. పైగా ఇవే చివరి ఎన్నికలు అంటూ సోమిరెడ్డి సెంటిమెంట్ తో బరిలో దిగుతున్నారు. చూడాలి మరి ఈ సారైనా సోమిరెడ్డికి అదృష్టం కలిసొస్తుందో లేదో.