ఆనంకు వైసీపీ గుడ్‌బై..కావాల్సింది ఇదేనా?

అధికార వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి వ్యవహారం మొదట నుంచి కాస్త వేరుగానే ఉందనే చెప్పాలి. సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే తాను మాత్రం ప్రభుత్వంలో జరిగే తప్పులని మాత్రమే ఎత్తిచూపుతున్నానని, వాటిని అర్ధం చేసుకోవడం లేదని ఆనం అంటున్నారు. కానీ ఇటీవల ఆయన విమర్శల దాడి మరింత పెరిగింది..దీంతో వైసీపీ అధిష్టానం సైలెంట్ గా ఆనంని సైడ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది.

ఇప్పటికే ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో వెంకటగిరి సీటు ఈయనకు లేదని తేలిపోయింది. తాజాగా 2+2గా ఉన్న ఆనం సెక్యూరిటీని 1+1గా మార్చారు. ఈ సెక్యూరిటీ టీడీపీ హయాంలో కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆనం గడపగడపకు తిరగడం మానేశారు.  ఈ క్రమంలోనే ఆయనకు జీఎస్‌‌డబ్ల్యూఎస్ కమిషనర్‌ నుంచి ఒక సందేశం అందింది. అందులో.. ‘గడపగడపకు’లో ఇప్పటివరకూ అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలంటూ ఎమ్మెల్యే ఆనంకు సందేశం వచ్చింది.

దీని బట్టి చూస్తే వైసీపీ అధిష్టానం ఇంకా ఆనంకు గుడ్ బై చెప్పేసినట్లే అని అర్ధమవుతుంది. అయితే ఆనంకు కూడా కావాల్సింది ఇదే అనే టాక్ ఉంది. అంటే ఆయన అంతటా ఆయన పార్టీ నుంచి బయటకెళ్లకుండా..వైసీపీ అధిష్టానమే వెళ్లిపోయేలా చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక ఈయన వైసీపీకి దూరమైనట్లే అని తెలుస్తోంది. అదే సమయంలో ఇంకా టీడీపీలో చేరడం కూడా లాంఛనమే అని తెలుస్తోంది. ఇటీవలే ఆయన టీడీపీ సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తానికి ఆనం వైసీపీని వీడటం ఖాయమైంది.