విజయవాడ-గుంటూరు ఎంపీ సీట్లలో ట్విస్ట్‌లు తప్పవా!

గత ఎన్నికల్లో వైసీపీ గాలిని సైతం ఎదురుకుని మూడు ఎంపీ సీట్లలో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం ఎంపీ సీట్లని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ సీట్లలో ఆధిక్యం సాధించడానికి గట్టిగానే ప్రయత్నించింది. కానీ ఎక్కడా కూడా టీడీపీ ఛాన్స్ ఇవ్వలేదు..మూడు చోట్ల టీడీపీదే పైచేయిగా ఉంది.

కాకపోతే శ్రీకాకుళం పక్కన పెడితే..గుంటూరు-విజయవాడ సీట్లలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. టీడీపీలో ఆధిపత్య పోరు ఉంది. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, అక్కడ కొందరు టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేశినేని సోదరుడు కేశినేని చిన్ని విజయవాడలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు..సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరికి కేశినేని యాంటీ వర్గంగా ఉన్న దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, బోండా ఉమా లాంటి వారి సపోర్ట్ ఉంది. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు కేశినేని చిన్నికి ఇస్తారనే ప్రచారం వస్తుంది.

ఈ క్రమంలోనే నాని ఇప్పుడు ఫుల్ గా యాక్టివ్ అయ్యారు..వ్యతిరేక వర్గంపై విరుచుకుపడుతూనే టీడీపీ కార్యక్రమాలు యాక్టివ్ గా చేస్తున్నారు. దీంతో విజయవాడ సీటు విషయంలో క్లారిటీ లేదు. కేశినేని నానికే మళ్ళీ సీటు ఇస్తారా? లేక ఏదైనా ట్విస్ట్ ఇస్తూ చిన్నికి ఇస్తారా? అనేది తెలియదు.

అటు గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు..ఈయన అక్కడ తక్కువ అందుబాటులో ఉంటున్నారు..అలాగే స్థానిక టీడీపీ నేతలతో టచ్ లో ఉండరు. దీంతో గల్లాని ఈ సారి పక్కన పెడతారనే ప్రచారం ఉంది. కానీ గల్లా లాంటి వారిని పక్కన పెట్టడానికి బాబు సాహసం చేయరు. కాబట్టి గుంటూరు ఎంపీ సీటు విషయంలో పెద్ద ట్విస్ట్ ఉండకపోవచ్చు.