లా స్టూడెంట్ అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌.. అపర్ణ బాలమురళి షాకింగ్ రియాక్ష‌న్‌!

రెండు రోజుల క్రితం ప్ర‌ముఖ హీరోయిన్ అపర్ణ బాలమురళితో ఓ లా స్టూడెంట్ అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌ల‌యాళంలో అప‌ర్ణ `తన్కమ్‌` అనే సినిమాలో న‌టించింది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా కేరళలోని ఓ లా కాలేజిలో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు అపర్ణ బాలమురళి హాజరైంది.

చిత్రబృందంతో కలిసి అపర్ణ వేదికపై కూర్చుని ఉండగా, ఓ విద్యార్థి అక్క‌డికి వ‌చ్చాడు. అపర్ణని బలవంతంగా పైకి లేపి, ఫోటో దిగాడు. అంతేకాదు ఫోటో దిగే స‌మ‌యంలో అపర్ణ భుజాల‌పై చేయి వేస్తూ అసభ్యకరంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ టైమ్ లో అప‌ర్ణ ఎంతో అసౌక‌ర్యానికి గురైంది. స్టేజ్‌పై చాలా మంది పెద్దలు ఉన్నా ఎవరూ అతన్ని ఆపలేదు సరికాదా, నవ్వుతుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం, స‌ద‌రు స్టూడెంట్ ను నెటిజ‌న్లు ఓ రేంజ్ లో ఏకేయ‌డం జ‌రిగిపోయింది.

అయితే తాజాగా ఈ ఘ‌ట‌నపై అప‌ర్ణ బాల‌మ‌ర‌ళి రియాక్ట్ అయింది. ఈ ఘటన తనని ఎంతగానో బాధించిందని తెలిపింది. ఒక మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అని అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులకు తాను ఫిర్యాదు చేయనని, అంత టైమ్ లేదని అప‌ర్ణ‌ చెప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు తనకు క్షమాపణలు చెప్పారని.. అందుకే దీన్ని ఇష్యూ చేయాలనుకోవడం లేదని ఆమె పేర్కొంది.