అటు సామినేని-ఇటు పవన్..వెల్లంపల్లికి షాక్ తప్పదా?

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అటు టి‌డి‌పిలో వర్గ పోరు ఉంటే..ఇటు వైసీపీలో కూడా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అనుకూల వాతావరణం కనిపించడం లేదు. ఆయన చేసే రాజకీయమే చివరికి ఆయనకే రివర్స్ అయ్యేలా ఉంది. గత ఎన్నికల్లో టి‌డి‌పిలో గ్రూపు రాజకీయం, జనసేన ఓట్లు చీల్చడం వల్ల 7 వేల ఓట్ల మెజారిటీతో వెల్లంపల్లి వైసీపీ నుంచి గెలిచారు. అలాగే మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మంత్రిగా ఉన్నప్పుడు ఈయనపై ఎన్ని ఆరోపణలు వచ్చాయో తెలిసిందే.

తర్వాత మంత్రి పదవి పోయాక సైలెంట్ అయ్యారు..కానీ తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కయ్యం వెల్లంపల్లికి రిస్క్ అయ్యేలా ఉంది. ఇటీవల విజయవాడ వెస్ట్‌కు చెందిన ఆకుల శ్రీనివాస్‌ని ఉదయభాను జగన్ వద్దకు తీసుకెళ్లారు. ఆకుల కుమార్తె పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్లారు. అందులో రాజకీయం లేదు. పైగా కాంగ్రెస్ టైమ్ నుంచ్ఈ ఆకులతో సామినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

కానీ తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి చెందిన నేతని జగన్ వద్దకు ఎందుకు తీసుకెళ్లావని, ఏమైనా పోటుగాడివా అని సామినేనిపై ఓ ఫంక్షన్‌లో వెల్లంపల్లి నోరు జారారు. అటు సామినేని సైతం అదే తరహాలో విరుచుకుపడ్డారు. పార్టీలు మారిన ఊసరవెల్లి అంటూ వెల్లంపల్లిపై ఫైర్ అయ్యారు. ఇలా ఇద్దరు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇదే సమయంలో సామినేనిని ఉద్దేశించి వెల్లంపల్లి కాపు రౌడీలు అని అన్నారని, అందుకు క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్ చేస్తుంది.

అయితే వెల్లంపల్లి ఇప్పటికే పవన్ కల్యాణ్‌ని పదే పదే టార్గెట్ చేసి తిడుతూ..కాపుల్లో యాంటీ తెచ్చుకున్నారు. ఇప్పుడు సొంత ఎమ్మెల్యేనే తిట్టి ఇంకా యాంటీ పెంచుకున్నారు. విజయవాడ వెస్ట్ లో కాపుల ఓట్లు బాగానే ఉన్నాయి. ఈ దెబ్బతో వెల్లంపల్లికి మైనస్ అయ్యేలా ఉంది. ఈ సారి ఎన్నికల్లో వెల్లంపల్లికి షాక్ తగలడం ఖాయమని అంటున్నారు.