పెదకూరపాడు వైసీపీలో రచ్చ..ఈ సారి దెబ్బపడుతుందా?

పల్నాడు ప్రాంతంలో కాస్త రాజకీయ వైవిధ్యం కలిగిన నియోజకవర్గం పెదకూరపాడు. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. అందులోనూ గత రెండు ఎన్నికల్లో ఇక్కడ కమ్మ నేతల మధ్యే పోటీ నడుస్తోంది. అయితే మొదట నుంచి ఇక్కడ టి‌డి‌పికి అంత పట్టు లేదనే చెప్పాలి. 1983, 1985 ఎన్నికల్లో టి‌డి‌పి గెలవగా, ఆ తర్వాత 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలిచింది..కాంగ్రెస్ తరుపున కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు.

ఇక 2009లో మళ్ళీ టి‌డి‌పికి ఛాన్స్ వచ్చింది. టి‌డి‌పి నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ గెలిచారు..2014లో కూడా మళ్ళీ ఆయనే గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి శ్రీధర్‌కు నంబూరు శంకర్ రావు చెక్ పెట్టారు. ఈ ఇద్దరు నేతలు కమ్మ వర్గమే. 14 వేల ఓట్ల మెజారిటీతో నంబూరు గెలిచారు. ఎమ్మెల్యేగా పెద్దగా ఎలాంటి వివాదాలు జోలికి వెళ్ళినట్లు ఉండరు. సైలెంట్ గానే పనిచేసుకుంటారు. అలాంటిది ఇప్పుడు పెదకూరపాడులో పెద్ద సంచలనమైన అంశం బయటపడింది.

ఈ మధ్య వైసీపీకి చెందిన కంచేటి సాయిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. పేరుకు నంబూరు ఎమ్మెల్యేగా ఉన్నా..సాయి షాడో ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గంలో పనిచేస్తున్నారని, ఇక ఇసుక రీచ్‌లు కూడా ఈయన చేతుల్లోనే ఉన్నాయని కథనం వచ్చింది. ఇసుక రీచ్‌ల ఆదాయంలో ఎమ్మెల్యే, సాయికి మధ్య వాటాలు ఉన్నాయని ఓ మీడియా కథనం ఇచ్చింది.

కానీ ఇసుక ఆదాయం పూర్తిగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే కావాలని అనడం, దీంతో సాయి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో అసలు రచ్చ మొదలైందట. చివరికి సాయిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో సాయి..ఎమ్మెల్యేకు చెక్ పెట్టాలని పనిచేస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఎమ్మెల్యేకు పూర్తి స్థాయిలో నియోజకవర్గంపై పట్టు లేదట. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ టి‌డి‌పికి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ సారి పెదకూరపాడులో వైసీపీ గెలుపు ఈజీ కాదని తెలుస్తోంది.