బెజవాడ పంచాయితీ..పార్టీని అమ్ముకున్న వారు వద్దు!

గత కొన్ని రోజులుగా విజయవాడ(బెజవాడ) తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో సొంత పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తన తమ్ముడు కేశినేని శివనాథ్‌కు గాని, ఇంకో ముగ్గురు నేతలకు సీటు ఇస్తే తాను సహకరించనని , అవసరమైతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కేశినేని ప్రకటనలు చేస్తున్నారు. బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా టార్గెట్ గా పరోక్షంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా విజయవాడ వెస్ట్ లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న కేశినేని..మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని, తనకు ఎటువంటి స్వార్ధం లేదని, కానీ పార్టీని అమ్ముకున్న వారు ఇక్కడ ఉండకూడదని, జలీల్‌ఖాన్‌ పార్టీ కోసం నిబద్దతతో పనిచేశాడని, పశ్చిమలో కొందరు పార్టీని అమ్మేసినా సరే.. టీం టీడీపీ విజయవాడ వెస్ట్‌ విభాగం బాగా పనిచేస్తోందని అన్నారు.

అయితే కేశినేని విమర్శలపై బుద్దా స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి అనలేదని, ఆ వ్యాఖ్యలను పట్టించుకోలేదని, తాను మిస్టర్‌ క్లీన్‌గా ఉన్నట్ట పేర్కొన్నారు. అయితే కార్పొరేషన్‌ ఎన్నికల్లో తనకు-కేశినేని నానికి చిన్న భేదాభిప్రాయమే తప్ప వ్యక్తిగత కక్షలు ఏవీ లేవన్నారు. పార్టీ ప్రక్షాళన జరగాలన్న కేశినేని నాని అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తానని, అయినా చంద్రబాబు నిర్ణయమే ఫైనల్‌ అని,  కేశినేనికి టికెట్‌ ఇచ్చినా పనిచేస్తానని చెప్పారు.

అటు కేశినేని శివనాథ్ సైతం..తన అన్నకు సీటు ఇస్తే పనిచేస్తానని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తానని తాను ఎన్నడూ చెప్పలేదని, సేవా కార్యక్రమాలు చేయడమే తనకు తెలుసని, ఎంపీగా కేశినేని నానిని నిలబెట్టినా అభ్యంతరం లేదన్నారు. ఇలా ఎవరికి వారు సెపరేట్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. అయినా సరే వీరి పంచాయితీకి బ్రేకులు వేయాలసిన బాధ్యత చంద్రబాబు పై ఉంది. త్వరగా వీరిని కలిపితేనే విజయవాడలో టీడీపీ కాస్త బాగుపడుతుంది. లేదంటే ఇంకా ఇబ్బందులు తప్పవు.