కృష్ణాలో వెనుకబడిన వైసీపీ..బడా నేతలే.!

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విషయంలో తాజాగా జగన్..వర్క్ షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ షాపులో గడపగడపకు పెద్దగా వెళ్లని ఎమ్మెల్యేలపై జగన్ కాస్త సీరియస్ అయినట్లు తెలిసింది. అందరూ ఖచ్చితంగా గడపగడపకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడంలో బాగా వెనుకపడ్డారని జగన్ తేల్చి చెప్పేశారు.

కృష్ణాలో 16 సీట్లు ఉంటే కేవలం ఒక సీటులోనే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు..మిగిలిన 15 సీట్లలో వైసీపీ వాళ్ళే ఉన్నారు. వీరిలో గడపగడపకు విషయంలో పూర్తిగా సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. పైగా ఐదుగురు బడా ఎమ్మెల్యేలపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మొదట గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని..గడపగడపకు వెళ్ళడంలో వెనకబడ్డారు. అనారోగ్యం వల్ల కొన్ని రోజులు కార్యక్రమం నిర్వహించలేదు. గుడివాడ టౌన్ లో 30 వార్డులు ఉంటే అందులో 20 వార్డులే పర్యటించారు. అటు గుడివాడ రూరల్ మండలంలో కేవలం 3 గ్రామాల్లోనే తిరిగారు. ఇంకా నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఇంకా ప్రారంభించలేదు.

అటు పెడనలో మంత్రి జోగి రమేష్ పరిస్తితి కూడా అంతే..పెడన మున్సిపాలిటీలో 23 వార్డులు ఉంటే 10 వార్డులు తిరిగారు. 124 పంచాయితీలు ఉంటే 30 చోట్ల తిరిగారు. ఇటు గన్నవరంలో వంశీ సైతం బాగా వెనుకబడ్డారు. ఆయన ఆలస్యంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక బందరులో మాజీ మంత్రి పేర్ని నాని బదులు..ఆయన తనయుడు కృష్ణమూర్తి తిరుగుతున్నారు. కానీ వారసులు తిరిగితే దాన్ని కౌంట్ చేయమని జగన్ అంటున్నారు.

ఇక మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పూర్తిగా వెనుకబడ్డారు. అక్కడ జోగి రమేష్‌తో ఉన్న విభేదాలు వల్ల..కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేశారు. మొత్తానికి కృష్ణాలో గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు బాగా వెనుకబడ్డారు.