బొత్స సొంత జిల్లాలో వైసీపీకి రిస్క్..ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతోనే..!

మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా అయిన విజయనగరంలో అధికార వైసీపీ బలం తగ్గుతుందా? గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో ఇప్పుడు మెజారిటీ తగ్గిపోతుందా? అంటే ప్రస్తుతం అక్కడ రాజకీయ పరిస్తితులని చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్, బొత్స రాజకీయ వ్యూహాలతో జిల్లాలో ఉన్న 9 సీట్లని వైసీపీ గెలిచేసుకుంది. ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు.

అలా అన్నీ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి..అలాంటిది ఇప్పుడు అక్కడ వైసీపీ బలం తగ్గుతుంది..కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం, మరికొందరు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అలాగే టీడీపీ బలం పెరుగుతుండటంతో జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్తితులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 9 సీట్లు ఉంటే ఇప్పుడు వైసీపీకి 5 సీట్లలోనే బలం కనిపిస్తోంది..నాలుగు సీట్లలో టీడీపీకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సారి కూడా జిల్లాలో వైసీపీ సత్తా చాటే దిశగా తీసుకెళ్లాలని బొత్స ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఇద్దరు ఎమ్మెల్యేల గురించి బొత్స ప్రస్తావించారు. జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు..కార్యకర్తల ఫోన్‌లు ఎత్తడం లేదని, ఆ విధంగా చేస్తే, పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పానని, వారిద్దరూ మారాలని చెప్పుకొచ్చారు. అయితే వారి పేర్లు మాత్రం చెప్పలేదు. దీంతో జిల్లాలో నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉంటున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అని వైసీపీలో చర్చ జరుగుతుంది.

అదే సమయంలో మొదట నుంచి కష్టపడ్డ నేతలకు, కార్యకర్తలకు పదవులు రాలేదనే అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ఉంది..అటు కాంట్రాక్టులు చేసిన బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో వైసీపీకి క్లీన్ స్వీప్ చేసే పరిస్తితి లేదు.